అమ్మ నా ట్రంపో.. మూడోసారీ అధ్యక్ష పదవికి టెండరు?

పైగా ఇటీవలి దశాబ్దాల్లో అమెరికాలో ఒకసారి అధ్యక్షుడిగా చేసి.. ఎన్నికల్లో ఓడిపోయి నాలుగేళ్ల తర్వాత పోటీ చేసిన వారు లేరు.

Update: 2025-01-25 20:30 GMT

అది 2021 జనవరి... అమెరికా అధ్యక్షుడిగా పదవి దిగిపోతున్న డొనాల్డ్ ట్రంప్ తాను 2024లో మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పటికే 70 ఏళ్లు దాటినందున ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఇటీవలి దశాబ్దాల్లో అమెరికాలో ఒకసారి అధ్యక్షుడిగా చేసి.. ఎన్నికల్లో ఓడిపోయి నాలుగేళ్ల తర్వాత పోటీ చేసిన వారు లేరు. కానీ, ట్రంప్ తాను చెప్పినదానికి కట్టుబడ్డారు. గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు.. గెలిచి అధ్యక్షుడు కూడా అయ్యారు.

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు.. మెక్సికో మాదక ద్రవ్య ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి వాటి నాశనానికి చట్ట సంస్థలకు అధికారం ఇవ్వడం, స్త్రీ, పురుష తప్ప మరే జాతులూ లేవని ప్రకటించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేయడం.. ఇలాంటి అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక నాయకుడికి గట్టి విల్ పవర్ ఉంటేనే ఇలాంటివి సాధ్యం. మొన్నటివరకు కనీసం ఊహించని నిర్ణయాలు ఇవి. కానీ, వీటిని డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక సంతకంతో సుసాధ్యం చేశారు. ఇక్కడితో ఆయన ఆగిపోయేలా లేరు. గ్రీన్ ల్యాండ్ పైనా కన్నేశారు. పనామా కాల్వ కావాలంటున్నారు. అంతేకాదు.. ఇంకో పెద్ద లక్ష్యమూ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ఏ వ్యక్తి అయినా సరే.. వరుసగా అయినా.. విడివిడిగా అయినా రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని నిర్వహించడానికి వీల్లేదు... ఇదీ అమెరికా రాజ్యాంగంలోని నిబంధన. కానీ దీన్ని మార్చేసి మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నాలను ట్రంప్ మొదలుపెట్టారని తెలుస్తోంది. దీనికితగ్గట్లు రాజ్యాంగ సవరణకు ట్రంప్ నకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యుడు యాండీ ఓగిల్స్‌ దిగువ సభలో సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టడం దీనినే సూచిస్తోంది.

ఒకవేళ ఓగిల్స్ ప్రతిపాదన ఆమోదం పొందితే అది అమెరికాకే కాదు.. ప్రపంచ చరిత్రలోనే పెద్ద సంచలనంగా మారుతుంది. 82 ఏళ్ల వయసులో 2028లో ట్రంప్‌ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు వీలు కల్పిస్తుంది.

కాగా, బైడెన్‌ పాలనలో అమెరికా వినాశకర ఫలితాలు చూసిందని, ట్రంప్‌ వచ్చాకే పరిస్థితిని చక్కదిద్దారని, దేశాన్ని బలోపేతం చేస్తున్నారని ఓగిల్స్‌ చెబుతున్నారు. దీన్నిబట్టి ట్రంప్ టీమ్ ఏదో పెద్ద ప్రణాళికలే వేస్తోందని తెలుస్తోంది.

మూడోసారి అధ్యక్షుడు సాధ్యమేనా?

ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణను మార్చాలి. అమెరికా కాంగ్రెస్‌, రాష్ట్రాల ఆమోదం దక్కాలి. అయితే, ఇది చాలా కష్టం. అమెరికాకు ఫ్రాంక్లిన్‌ రూజ్‌ వెల్ట్‌ మాత్రమే నాలుగు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఎవరైనా రెండుసార్లకు మించి అధ్యక్షుడు కాకుండా 1951లో అమెరికా 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. దీనిని సవరిస్తేనే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కాగలరు.

Tags:    

Similar News