డోనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ డీల్‌ నిజమేనా?

ఈ సందర్భంగా ట్రంప్‌.. తన సోషల్‌ మీడియా సంస్థ ట్రూత్‌ ను కొనుగోలు చేయాలని ఎలాన్‌ మస్క్‌ ను కోరాడు.

Update: 2024-03-14 08:30 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను గతంలో ఆ సంస్థ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న పోస్టులు ట్విట్టర్‌ నిబంధనావళికి అనుగుణంగా లేవని, విద్వేషాలను వ్యాపింపజేసేలా ఉన్నాయని ట్విట్టర్‌ ఆయన ఖాతాపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా.. ‘ట్రూత్‌’ను ప్రారంభించారు. దీనిలోనే ఆయన ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలను పోస్టు చేస్తున్నారు.

కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’ ను ప్రపంచ కుబేరుల్లో ఒకరు, టెస్లా, స్పేస్‌ ఎక్స్, ఎక్స్‌ కంపెనీల అధినేత అయిన ఎలాన్‌ మస్క్‌ కు అమ్మేయాలనుకున్నట్టు తెలుస్తోంది. ట్రూత్‌ ను కొనుగోలు చేయాలని ట్రంప్‌.. ఎలాన్‌ మస్క్‌ ను కోరాడని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.

వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రకారం... గతేడాది వేసవిలో డోనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు రాజకీయాలు, వ్యాపారాలు సహా చాలా అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. తన సోషల్‌ మీడియా సంస్థ ట్రూత్‌ ను కొనుగోలు చేయాలని ఎలాన్‌ మస్క్‌ ను కోరాడు. చర్చలు ఫలప్రదం కాకపోయినా మస్క్‌ ట్రూత్‌ ను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని తన సలహాదారులను ఆదేశించారు.

కాగా ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పామ్‌ బీచ్‌ రిసార్ట్‌ లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యులతో డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మధ్య ట్రూత్‌ కు సంబంధించిన డీల్, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు వాషింగ్టన్‌ పోస్టు నివేదించింది.

అయితే వాషింగ్టన్‌ పోస్టు కథనాన్ని ఎలాన్‌ మస్క్‌ తోసిపుచ్చారు. తాను ఆ సమావేశానికి వెళ్లలేదన్నారు. మరోవైపు ట్రంప్‌ మాత్రం తమ మధ్య జరిగిన భేటీని ధ్రువీకరించారు. అంతేకాకుండా ఎలాన్‌ మస్క్‌ తనకు ఎన్నో ఏళ్లుగా స్నేహితుడని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంతో సాయం చేశానని వెల్లడించారు. అయితే ఎలక్ట్రిక్‌ కార్లు వంటి విషయాల్లో తమిద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని తెలిపారు.

కాగా వాషింగ్టన్‌ పోస్టు కథనంపై ట్రంప్‌ మీడియా–టెక్నాలజీ గ్రూప్‌ ప్రతినిధి షాన్నన్‌ డెవిన్‌ వెటకారంగా స్పందించారు. తనకు తెలిసినంతవరకు డోనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ వాషింగ్టన్‌ పోస్టును కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. అయితే వాషింగ్టన్‌ పోస్టుకు ఎలాంటి విలువ లేదని వదిలేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా తనపై ట్విట్టర్‌ నిషేధం విధించడంతో ట్రంప్‌ ప్రారంభించిన ట్రూత్‌ సోషల్‌ మీడియా మాధ్యమం 2022 నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌’లో విలీనానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ విలీన ఒప్పందానికి ఇటీవలే అమెరికా ఎస్‌ఈసీ ఆమోదముద్ర వేసింది.

Tags:    

Similar News