ట్రంప్ ను ఇంటర్వ్యూ చేయబోతున్న ప్రపంచ కుబేరుడు ట్విస్టు ఏమంటే?
అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో వ్యవహరించే ఈ ఇద్దరి మధ్య ప్రశ్న - సమాధానాల ప్రోగ్రాంకు మించిన ఆసక్తికర అంశం ఏముంటుంది?
ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించి.. మరోసారి ఆ పదవిని సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్న పెద్దమనిషి ఒకరు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో మరొకరు. ఇలాంటి ఇద్దరు ప్రముఖులు భేటీ కావటమే ఆసక్తికరమైతే.. తాజా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ ను.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేస్తే? ఈ ఆలోచనే క్రేజీగా ఉంది కదా? సరిగ్గా ఇలానే చేయనున్నారు వీరిద్దరు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి.. ఈ ఇద్దరూ ఇద్దరే. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో వ్యవహరించే ఈ ఇద్దరి మధ్య ప్రశ్న - సమాధానాల ప్రోగ్రాంకు మించిన ఆసక్తికర అంశం ఏముంటుంది?
ఇంతకూ ఈ ఆసక్తికర అంశాన్ని ఎవరు ప్రస్తావించారంటే.. డొనాల్డ్ ట్రంపే. అధ్యక్ష ఎన్నికల్లో బిజీబిజీగా ఉంటూ.. తీరిక లేని షెడ్యూల్ లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్ని చేపడుతూనే.. ఇమేజ్ గ్రాఫ్ పెరిగేందుకు అవకాశం ఉన్న ఏ చిన్న కార్యక్రమాన్ని మిస్ కాకుండా.. వివిధ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ట్రంప్..తాజాగా మాట్లాడుతూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనను ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆసక్తికర విషయాల్ని వెల్లడించే అలవాటు ఉన్న మస్క్.. ట్రంప్ రివీల్ చేసిన తర్వాత కూడా స్పందించకపోవటం గమనార్హం.
ఈ ఇంటర్వ్యూ ఎక్స్ (ట్విటర్)లో టెలికాస్ట్ అవుతుందని చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఇదే ఎక్స్ .. గతంలో ట్రంప్ ను నిషేధించింది. అలాంటి ట్రంప్ ను తాజాగా దాని యజమాని అయిన ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాను క్రియేట్ చేసినట్లుగా చెబుతున్న పొలిటికల్ యాక్షన్ కమిటీపై మిషిగన్.. నార్త్ కరోలినా ఎన్నికల బోర్డు అధికారులు దర్యాప్తు షురూ చేశారు.
ఈ కమిటీపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కమిటీ ఓటర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. అనేక మందిపై నిఘా వేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న విమర్శ ఉంది. ఈ అన్ని అంశాలపై అధికారులు విచారణ చేస్తున్న వేళలో.. ట్రంప్ కు మద్దతుగా ఈ కమిటీ పని చేస్తోంది. ఇలాంటి సమయంలోనే ఎలాన్ మస్క్ తనను ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని ట్రంప్ పేర్కొనటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఒక లైవ్ స్ట్రీమర్ (అడిన్ రోస్)కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ‘కిక్’ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీద టెలికాస్ట్ అయ్యింది. ఈ ప్లాట్ ఫామ్ కు రికార్డు స్థాయిలో వ్యూయర్స్ పెరగటం గమనార్హం. ఈ లెక్కన ట్రంప్ - మస్క్ ఇంటర్వ్యూకు సంబంధించి మరెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.