హైదరాబాద్ నారీ శక్తి: దొంగలకు చుక్కలు చూపిన తల్లీకూతుళ్లు

నవరతన్ జైన్.. అమిత్ జైన్ లు ఇద్దరు భార్యభర్తలు. వారికో మైనర్ కుమార్తె ఉంది.

Update: 2024-03-22 04:33 GMT

అనూహ్య పరిణామం ఎదురైతే వణికిపోవటం ఎవరైనా చేస్తారు. అందుకు భిన్నంగా వారిని ధీరత్వంతో ఎదుర్కొన్న అమ్మాకూతుళ్ల ఉదంతం హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. నాటు గన్ తో పాటు కత్తి పట్టుకొని ఇంట్లో చోరీకి ప్రయత్నం చేసిన ఇద్దరు దుండగుల్ని సనత్ నగర్ కు చెందిన తల్లీకుమార్తెలు ధైర్యంగా ఎదుర్కొనటమే కాదు.. ఒకరిని గదిలో బంధించిన వైనం ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో పారిపోయిన మరొకరిని ఉమ్మడివరంగల్ జిల్లాలో పట్టుకున్నారు. గురువారం హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట పైగా కాలనీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. . అసలేం జరిగిందంటే..

నవరతన్ జైన్.. అమిత్ జైన్ లు ఇద్దరు భార్యభర్తలు. వారికో మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వేళ ఇంటి యజమాని ఇంట్లో లేని వేళలో ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. వారిద్దరు ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్ ధరించగా.. మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నాటు గన్ తో పాటు కత్తిని చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ఇంట్లో ఉన్న డబ్బులు.. నగలు తీసుకురావాలని ఆదేశించారు.

ఈ విషయంలో తేడా వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. తల్లిని బెదిరిస్తున్న ఇద్దరు దుండగుల తీరు చూసిన మైనర్ కుమార్తె భయానికి గురి కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చింది. దీంతో తల్లికి ధైర్యం వచ్చింది. వారిద్దరుకలిసి దుండగుల చేతిలోని ఆయుధాల్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పెనుగులాటలో నాటు గన్ తల్లీకూతుళ్ల చేతికి వచ్చింది. ఒకరిని ఒక గదిలో బంధించగా.. మరొకరు పారిపోయే ప్రయత్నం చేయగా.. అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు.

ఇంట్లో బందీగా ఉంచిన వ్యక్తి తనను వదిలేయాలని, లేదంటే దాడి చేస్తానని బెదిరింపులకు దిగారు. తల్లీకూతుళ్ల అరపులకు చుట్టుపక్కల వారు వచ్చారు. అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఇంతకీ వీరింట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఎవరో కాదు.. గతంలో ఆ ఇంట్లో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్ చంద్.. అతడి స్నేహితుడు సుశీల్ కుమార్ లుగా గుర్తించారు. వీరిలో ప్రేమ్ చంద్ ను స్థానికులు పట్టుకుంటే.. మరొకరిని కాజీపేలో పట్టుకున్నారు. దుండగుల బెదిరింపులకు బెదరక.. ధైర్యంగా పోరాడిన తెగువకు తల్లీకూతుళ్లను అందరూ పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News