తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్

తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజ్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.

Update: 2024-03-19 07:47 GMT

తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజ్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇక రాష్ట్ర కొత్త గవర్నర్ గా సీపీ రాధాక్రిష్ణన్ ను నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. తమిళి సై సౌందర్య రాజన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

తమిళనాడుకు చెందిన సీపీ రాధాక్రిష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు లోక్ సభ నుంచి 1998, 1999లో ఎంపీగా గెలిచారు. తమళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై సోమవారం తన పదవికి రాజీనామా చేసింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె కరుణానిధి కూతురుపై పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చెన్నై సెంట్రల్ లేదా తుత్తూకూడి నుంచి ఆమె బీజేపీ ఎంపీగా పోటీకి దిగనుంది. దీంతోనే గవర్నర్ పదవికి టాటా చెప్పేసింది.

తమిళిసైకి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ కు మధ్య సంబంధాలు సరిగా ఉండేవి కావు. గవర్నర్ పాత్రపై అనేక సందర్భాల్లో వివాదాలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సమయంలో కూడా గవర్నర్ ఆహ్వానించకపోవడంతో అప్పట్లో సంచలనాలు కలిగించాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో గొడవలే ప్రధానంగా ఉండేవి.

ప్రస్తుతం వస్తున్న సీపీ రాధాక్రిష్ణన్ ఎలా వ్యవహరిస్తారో తెలియడం లేదు. తెలంగాణకు గవర్నర్ గా చేసిన వారిలో ఎవరు కూడా వివాదాలకు పోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం గవర్నర్ టార్గెట్ చేసుకుని అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పనులు కాకుండా చేసుకున్నారనే విమర్శలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ తీరు ఎలా ఉంటుందనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి.

Tags:    

Similar News