ఎన్టీయార్ శిష్యుడు కేసీయార్...ఇంటరెస్టింగ్ కామెంట్...!
నందమూరి తారక రామారావు శిష్యుడు కేసీయార్ అని బీయారెస్ మంత్రి కేటీయార్ గొప్పగా చెప్పుకున్నారు.
నందమూరి తారక రామారావు శిష్యుడు కేసీయార్ అని బీయారెస్ మంత్రి కేటీయార్ గొప్పగా చెప్పుకున్నారు. ఎన్టీయార్ రికార్డుని బద్ధలు కొట్టేది కూడా కేసీయారే అని అంటున్నారు. ఇలా కేసీయర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ నే కేటీయార్ చేశారు. శనివారం ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ పార్క్ ను, విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీయార్ ఎన్టీయార్ ని పొగుడుతూనే కేసీయార్ ని కూడా పొగిడారు.
ఈ ఇద్దరు నేతల గురించి వివరించే ప్రయత్నం చేసారు. ఎన్టీయార్ కి తగిన శిష్యుడు కేసీయార్ అని కూడా అన్నారు. ఎన్టీయార్ బాటలో నడిచే శిష్యుడు కేసీయార్ అని అన్నారు. దేశం నలుమూలలా తెలంగాణా అస్థిత్వాన్ని కేసీయార్ చాటి చెప్పారని గుర్తు చేశారు. మరో వైపు చూస్తే ఎన్టీయార్ సహా దక్షిణాదికి చెందిన నేతలు ఎవరూ వరసగా మూడు సార్లు ముఖ్యమంత్రులుగా గెలిచిన దాఖలాలు లేవని ఆ రికార్డు ని కేసీయార్ తెలంగాణా ఎన్నికల్లో సాధిస్తారు అని కేటీయార్ చెప్పడం విశేషం.
బీయేరెస్ త్వరలో జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించబోతోంది అని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే కేటీయార్ రాజకీయ జీవితం చూసుకుంటే ఆయన ముందు కాంగ్రెస్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత 1983లో ఎన్టీయార్ పిలుపు అందుకుని టీడీపీలో చేరారు. 1983లో సిద్ధిపేట నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పెద్ద నాయకుడు మదన్ మోహన్ మీద కేవలం 800 ఓట్ల తేడతో ఓటమి పాలు అయ్యారు.
ఆ తరువాత మాత్రం ఆన అదే సిద్దిపేట నుంచి ఆరు సార్లు వరసగా గెలిచారు 1985, 1989, 1994, 1999లలో గెలిచిన కేసీయార్ 2001లోజరిగిన ఉప ఎన్నికల్లోనూ టీయారెస్ మీద ఫస్ట్ టైం గెలిచారు. 2004లో టీయారెస్ మీద రెండవసారి గెలిచారు. ఇలా కేసీయార్ ఈ రోజుకు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన రికార్డుని సొంతం చేసుకున్నారు.
ఎన్టీయార్ అంటే బాగా ఇష్టపడే కేసీయార్ కి ఆయన 1987 ప్రాంతంలో మంత్రి పదవి ఇచ్చారు. అలాగే 1996లో చంద్రబాబు టైం లో రవాణా శాఖ మంత్రిగా పదవిని మూడేళ్ళ పాటు నిర్వహించారు. ఎన్టీయార్ నాయకత్వంలోని టీడీపీలో కేసీయార్ పదమూడేళ్ల పాటు పనిచేస్తే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో ఆరేళ్ళు మాత్రమే పనిచేశారు.
ఆ విధంగా చూస్తే కేసీయార్ ఎన్టీయార్ శిష్య్డుగానే చెప్పుకోవాలి. తెలుగు భాష మీద ఎన్టీయార్ లాగానే కేసీయార్ కి కూడా పట్టు ఉంది. అలాగే పట్టుదల గల రాజకీయాలే ఆయన చేశారు జాతీయ స్థాయిలో రాణించేలా పావులు కదుపుతున్నారు. అయితే కేసీయార్ మీద ఒక ముద్ర ఉంది. ఆయన చంద్రబాబు శిష్యుడు అని. ఆయన మాదిరిగానే వ్యూహ రచన చేస్తారు అని. కానీ ఇపుడు ఆయన తనయుడు కేటీయార్ అలా కాదు కేసీయార్ ఎన్టీయార్ కే అచ్చమైన శిష్యుడు అంటున్నారు.
ఇటీవలనే చంద్రబాబు అరెస్ట్ మీద కేటీయార్ మాట్లాడుతూ అది పొరుగు రాష్ట్రం వ్యవహారం అన్నారు. హైదరాబాద్ లో ఆందోళనలు ఎలా చేస్తారు అని కూడా ప్రశ్నించారు. దాంతో ఒక బలమైన సామాజికవర్గం బాధపడింది అని వార్తలు వచ్చాయి.
దాంతో ఇపుడు బ్యాలన్స్ చేసేలా ఎన్టీయార్ శిష్యుడు కేసీయార్ అని చెప్పుకొస్తున్నారా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా కేటీయార్ వ్యూహాలే వేరు అంటారు. కేసీయార్ ఒకప్పుడు బాబు శిష్యుడేమో కానీ 2001 తరువాత మాత్రం కానే కాదు అంటారు. ఆయన ఏమైనా చెప్పుకుంటే ఎన్టీయార్ గురించే చెప్పుకుంటారు అనడానికి కేటీయార్ కామెంట్స్ ఒక ఉదాహరణ అంటున్నారు.