ప్యాకేజ్ స్టార్ కు కొత్త పేరు పెట్టిన కేటీఆర్!

చురుగ్గా స్పందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీరు మిగిలిన వారికి కాస్త భిన్నంగా ఉంటుంది.

Update: 2023-10-08 05:18 GMT

చురుగ్గా స్పందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీరు మిగిలిన వారికి కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు.. తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో కాస్తంత త్రోటుపాటుకు గురవుతుంటారు. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ మాత్రం ఒక పద్దతి ప్రకారం.. తాను టార్గెట్ చేసిన వారి తుప్పు వదిలేలా ఘాటు విమర్శలు చేస్తారు. ప్రధానమంత్రి మోడీ మొదలుకొని స్థానిక నేతల వరకు ఆయన ఎవరిని వదిలపెట్టరు. సాధారణంగా ఒక స్థాయికి చేరుకున్నామన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత నేతలు.. తమ విమర్శల స్థాయిని పరిమితం చేసుకుంటారు. కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకొని మాట్లాడతారు. ప్రత్యేక సందర్భాలు మినహాయించి.. మిగిలిన సందర్భాల్లో వారు ఇదే తీరును ప్రదర్శిస్తుంటారు.

కానీ.. మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు భిన్నం. తమ రాజకీయ ప్రయోజనాలకు అడ్డుగా ఉన్న వారు ఎవరైనా.. వారి స్థాయిని పట్టించుకోకుండా మాటలతో ఉతికేసే కార్యక్రమాన్ని చేపడుతుంటారు. ప్రధాని నరేంద్ర మోడీని మంత్రి కేటీఆర్ విమర్శించినంత ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మరెవరూ విమర్శించలేదని చెప్పాలి. అలాంటి కేటీఆర్ ఫోకస్ ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ మీద పడింది.

గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందని.. అధికార బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. కాంగ్రెస్ మీద తన విమర్శల గురిని పెట్టిన కేటీఆర్.. తాజాగా రేవంత్ ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ను టార్గెట్ చేయటానికి.. ఏపీలో జనసేన అధినేత పవన్ ను ఏ రీతిలో అయితే ప్యాకేజీ స్టార్ అని పిలుస్తారో.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ పేరుకు తగ్గట్లు చేసిన కొత్త పద ప్రయోగం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

కేటీఆర్ లో ముచ్చటేసే గుణం ఏమంటే.. తాను ప్రత్యేకించి ఏమీ అనని.. అందరూ అంటున్న మాటనే తాను చెబుతున్నట్లుగా చెప్పి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా రేవంత్ విషయానికి వస్తే.. ఆయన్ను రేటెంత రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలోని నేతలే పిలుస్తున్నారని.. తాను అదే మాటను చెబుతున్నట్లుగా చెప్పటం చూస్తే.. కేటీఆర్ ఎంత గడుసుపిండమో అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముతున్నాడని.. ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ కు ధోకా ఇచ్చేసి.. 10 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపణల వర్షాన్ని కురిపించారు.

ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చిన వారికి అడ్డగోలుగా కోట్ల రూపాయిలకు సీట్లను రేవంత్ అమ్ముకుంటున్నట్లుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన్ను రేవంత్ రెడ్డిగా కాదు రేటెంత రెడ్డిగా కాంగ్రెస్ పార్టీలో పిలుస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. రేవంత్ చేతిలో మోసపోయి.. బీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలే తనకు స్వయంగా ఈ మాట చెబుతున్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రేవంత్ గెలిచే పది.. పన్నెండు మంద్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్లనున్నట్లుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. మరి.. దీనికి రేవంత్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News