ఖమ్మంలో నేతలు తగ్గారు.. సీట్లు పెరుగుతాయి.. కేటీఆర్ లెక్క
తెలంగాణ ఏర్పాటు అనంతరమే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం పదేళ్లుగా కొరుకుడు పడనిదిగానే మిగిలింది.
తెలంగాణ ఏర్పాటు అనంతరమే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం పదేళ్లుగా కొరుకుడు పడనిదిగానే మిగిలింది. మొదటిసారి అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి.. నాయకులు పెద్దగా లేరు కాబట్టి పోనీలే అనుకుంటే, రెండోసారి అధికారంలో ఉండి.. పెద్దపెద్ద నాయకులు ఉండి కూడా ఒక్క సీటుకే పరిమితమైంది. వాస్తవానికి తొలిసారి 2014లో అధికారంలో వచ్చిన సమయంలో ఉమ్మడి ఖమ్మంలో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ గెలవగలిగింది. మిగతా 9 నియోజకవర్గాల్లోనూ ఓడింది. ఉమ్మడి ఖమ్మంలో సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో మొదటినుంచి తెలంగాణ వాదం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో నామమాత్రమే. దీనికితగ్గట్టుగానే ఉమ్మడి ఖమ్మంలో కొత్తగూడెంను బీఆర్ఎస్ 2014లో కైవసం చేసుకుంది. అయితే, తదుపరి పరిణామాల్లో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి చేరడంతో ఖమ్మంలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఎమ్మెల్యేగా ఓడిన తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి.. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయించగా ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. పొంగులేటి ఎంపీగా జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపగల నాయకుడు. కానీ, ఈ ఇద్ధరి రాకతో బలం పెరగాల్సింది పోయి తగ్గింది.
రాష్ట్రమంతటా గాలి.. ఖమ్మంలో ఎదురుగాలి
2014లో 60 పైగా సీట్లతో బొటాబొటీ మెజార్జీ సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని బలపడింది. 2018లో ముందుస్తు ఎన్నికలకు వంద సీట్ల టార్గెట్ పెట్టుకుంది. కానీ, 90 చిల్లర దగ్గరే ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి ఖమ్మంలో పడిన దెబ్బనే. 2014లో లాగే 2018లోనూ ఈ జిల్లాలో ఒక్కటే సీటుకు పరిమితమైంది బీఆర్ఎస్. అయితే, దీనికి కారణం వర్గ కుమ్ములాటలే అని నిర్ధారణకు వచ్చింది. తుమ్మలతో పాటు పొంగులేటినీ పక్కనపెట్టింది. తదనంతర పరిణామాల్లో ఈ ఇద్దరూ ఆ పార్టీకి దూరమయ్యారు. నెలల వ్యవధిలోనే ఇటీవల కాంగ్రెస్ లో చేరారు.
నాయకుల్లేకున్నా సీట్లు గెలుస్తారట
‘‘ఉమ్మడి ఖమ్మంలో ఈ సారి నేతలు తగ్గారు.. సీట్లు పెరుగుతాయి..’’ శనివారం ప్రగతిభవన్ లో చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అంటే.. పొంగులేటి, తుమ్మల ఇద్దరూ పార్టీని వీడడంతో వర్గ విభేదాల బెడద తీరిందని ఆయన భావిస్తున్నట్లు ఉంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మంలో తుమ్మల ప్రభావం చాలా ఎక్కువ. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన తెచ్చుకున్న పేరు అది. నియోజకవర్గాల వారీగా ఆయనకు అనుచర, అభిమాన గణం ఉంది. ఇక పొంగులేటి 2014లో ఎంపీగా గెలిచి రికార్డులకెక్కారు. దీనిలో వైఎస్సార్సీపీ బలం కంటే ఆయన సొంత బలమే ఎక్కువని అంటారు. అయితే, వీరిద్దరూ బీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ బలం పెరగాల్సింది పోయి తగ్గింది. అధికారంలో ఉండి కూడా ఒక్క సీటుకే పరిమితమైంది. దీన్నిబట్టే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.
ఈసారి ఏమవుద్దో..?
2014, 2018లో ఉమ్మడి ఖమ్మంలో ఒక్కో సీటుతోనే సరిపెట్టుకున్న బీఆర్ఎస్ కు ఈసారి ఎలాంటి ఫలితం ఎదురవుదో చూడాలి. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న పెద్ద నాయకుడు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే. మిగతా చాలా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు వారి నియోజకవర్గాల వరకే పేరున్నవారు. తుమ్మల, పొంగులేటి తరహాలో కాకపోయినా.. జిల్లాలో కనీసం సగం నియోజకవర్గాల్లోనైనా ప్రభావం చూపలేరు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగినా.. ఫలితాల తర్వాత అది ప్రత్యేకమే అవుతుంది.