అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ పోలీస్?
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు.. తమకు అనుకూలంగా ఉండే వారినో.. తమకు సౌకర్యవంతంగా ఉండే పోలీసులను కోరి మరీ పోస్టింగులు ఇప్పించుకున్నారు.
పోలీస్ అంటే పోలీసే. రూల్ అంటే రూల్ అన్నట్లుగా పని చేయాలే కానీ.. వ్యవస్థలోని ఎంతటి తోపు అయినా సరే చుక్కలు చూపించాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పోలీసింగ్ కనిపిస్తుందన్నమాట పలువురి నోట వినిపిస్తోంది. కీలకమైన ఎన్నికలకు కాస్త ముందుగా.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఐ.. ఆ పై అధికారుల బదిలీలు జరిగాయి.
ఈ బదిలీల సందర్భంగా తమకు నచ్చిన సీఐలను పట్టుబట్టి మరీ పోస్టింగులు ఇప్పించుకున్నారు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు.. తమకు అనుకూలంగా ఉండే వారినో.. తమకు సౌకర్యవంతంగా ఉండే పోలీసులను కోరి మరీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా పట్టించుకున్నది లేదు.
అయితే..తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం.. కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలోకి అధికారులు వెళ్లిపోవటంతో.. రూల్ అంటే రూల్ అన్నది ఎలా? అన్నది చేతల్లో చూపిస్తున్న పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము పోస్టింగ్ ఇప్పించిన అధికారులే అయినప్పటికి అధికార పార్టీ అభ్యర్థులకు సైతం తిప్పలు తప్పట్లేదంటున్నారు.
ఎన్నికల సందర్భంగా నిర్వహించే వాహనాల తనిఖీ సందర్భంగా..తమకు స్వయంగా పోస్టింగ్ ఇప్పించిన నేత కారులో ఉన్నప్పటికీ.. వారిని కిందకు దించి మరీ తనిఖీలు చేస్తున్న వైనంతో సదరు నేతలు పరేషాన్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.అయినప్పటికీ తాము చేయగలిగింది ఏమీ లేదని.. రూల్ ను ఫాలో కావటమేనంటూ సదరు అదికారులు చెబుతున్నారు. తమకు సాయం చేయలేదని చెప్పట్లేదని.. అలా అని ఎన్నికల వేళ.. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే.. తమ కెరీర్ కు భారీ దెబ్బ తగులుతుందని.. ఎన్నికల వేళ.. ఎలాంటి రిస్కులు తీసుకోలేమని వారు స్పష్టం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినప్పటికి.. ఈ తరహా అనుభవం మాత్రం తమకు ఎదురు కాలేదన్న మాట అధికార పార్టీ నేతల నోటి నుంచి వినిపించటం గమనార్హం.