ఏపీ పొలిటిక‌ల్ హాట్ టాపిక్‌: `తుల‌సి` ఎవ‌రికి బాబు.. అనేక సందేహాలు...!

ర‌ఘురామ‌ను వేధించేందుకు తుల‌సి బాబును కూడా ఆయుధం చేసుకున్నార‌న్న చ‌ర్చ ఉంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు గుడివాడ‌లో వైసీపీ బ‌లం లేదు. అంతా టీడీపీదే.

Update: 2025-01-24 22:30 GMT

గ‌త నెల రోజులుగా `తుల‌సి` బాబు చుట్టూ రాజ‌కీయాలు సాగుతున్నాయి. ప్ర‌స్తుత ఉప స‌భాప‌తిగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంపీగా ఉన్న స‌మ‌యంలో కేసు న‌మోదు కావ‌డం.. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. గుంటూరులోని సీఐడీ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చి.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ఆయన ఆరోపించ‌డం తెలిసిందే. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అయితే.. అప్ప‌ట్లో త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించిన‌ప్పుడు త‌న గుండెల‌పై ఒక‌రు కూర్చున్నార‌ని ర‌ఘురామ ఆరోపించారు.

అలా గుండెల‌పై కూర్చున్న వ్య‌క్తి తుల‌సి బాబేన‌న్న‌ది తాజాగా వెలుగు చూసిన విష‌యం. దీనిపై ఇంకా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తుల‌సి బాబును అరెస్టు చేయ‌డం  తెలిసిందే. ఈ మొత్తం వ్య‌వ‌హారం.. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం చుట్టూ తిర‌గ‌డం కూడా రాజ‌కీయంగా అనేక మ‌లుపులు తిరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. గుడివాడ ఎమ్మెల్యేకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన వ్య‌క్తిగా తుల‌సి బాబు ఉన్నార‌న్న‌ది ఓ వ‌ర్గం చెబుతున్న మాట‌.

అందుకే.. ర‌ఘురామ‌ను వేధించేందుకు తుల‌సి బాబును కూడా ఆయుధం చేసుకున్నార‌న్న చ‌ర్చ ఉంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు గుడివాడ‌లో వైసీపీ బ‌లం లేదు. అంతా టీడీపీదే. పైగా.. టీడీపీ ఎమ్మెల్యే హ‌వానే ఇక్కడ సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. తులసిబాబుపై చ‌ర్య‌లు కానీ... క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం కానీ, జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ర‌ఘురామ త‌ర‌ఫున ఉన్న ప్ర‌శ్న‌. దీనిపై అనుకూల మీడియా కూడా అనేక క‌థ‌నాలు ఇస్తోంది. తుల‌సి బాబును ఎవ‌రో కాపాడుతున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది.

అయితే.. అస‌లు తుల‌సిబాబు.. ఎవ‌రి క‌నుస‌న్న‌ల్లో ఉంటారు? అనేది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఆయన అనుస‌రించే వ్యూహ‌మే అప్ప‌ట్లోనూ.. ఇప్పుడు కూడా.. తుల‌సి బాబుకు రాజ‌కీయంగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తోందన్న చ‌ర్చ కూడా ఉంది. ఆది నుంచి ఓ కీల‌క నాయ‌కుడికి అనుచ‌రుడిగా ఉన్న తుల‌సి.. గత ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీకి అనుకూలంగా మారారు. ఈయ‌న చేతిలో 30-50 వేల ఓటు బ్యాంకు ఉన్న‌ట్టు అన్ని పార్టీల‌ నాయ‌కులు చెబుతున్నారు.

సామాజిక వ‌ర్గం కానీ, ఇత‌ర వ్యాపార వ‌ర్గాలు కానీ.. తులసి బాబుకు పెట్ట‌నికోట‌గా ఉంటారు. అందుకే.. పార్టీల‌తో సంబంధం లేకుండా కూడా. నాయ‌కులు తులసితో స్నేహం చేస్తారు. ఇదే.. ఆయ‌న‌కు ఇప్పుడు క‌వచంగా మారింద‌ని.. అందుకే.. ఆయ‌న త‌ప్పించుకుంటున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అందుకే.. తుల‌సి ఎవ‌రి వాడు.. ? అనే ప్ర‌శ్న వ‌స్తే.. అంద‌రూ మౌనంగా ఉంటున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న అంద‌రి వాడేన‌ని అంటున్నారు!!

Tags:    

Similar News