మహా ఘోరం.. డ్రగ్స్ కోసం ఇద్దరు బిడ్డలను అమ్ముకున్నారు
మరో కొత్త పేరేమైనా పెట్టాలా అన్నది చర్చనీయాంశమే! ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
పిల్లలు లేక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న దంపతులు ఒకపక్క.. పిల్లల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న దంపతులు మరోపక్క.. ఉన్న పిల్లల విలువ తెలియక వారిని అంగడి సరుకులుగా మారుస్తున్న తల్లితండ్రులు ఇంకోపక్క! వీరిని పిల్లల విలువ తెలియని మూర్ఖులు అనాలా.. లేక, మరో కొత్త పేరేమైనా పెట్టాలా అన్నది చర్చనీయాంశమే! ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... రక్త సంబంధం, ఆప్యాయత, అనురాగం వంటి విషయాలు మరిచిపోయిన ఇద్దరు దంపతులు తమ ఇద్దరు బిడ్డలను అమ్మకానికి పెట్టారు. అది కూడా... డ్రగ్స్ కొనుక్కోవడం కోసం! డ్రగ్స్ కు బానిసలైపోయిన ఆ దంపతులు ఉచ్చనీచాలు మరిచారు. మత్తు కోసం బిడ్డలను అంగడి సరుకులుగా చేశారు. విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి పని వారు చేశారు!
వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్ కు బాగా అలవాటుపడ్డారు. ఆ మత్తు మైకంలో తాము మనుషులం అనే విషయం మరిచినట్లున్నారు. దీంతో డ్రగ్స్ కి డబ్బులు లేకపోవడంతో ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా... తమ రెండేళ్ల కుమారుడిని అమ్మకానికి పెట్టారు.
దీంతో పిల్లలు లేని దంపతులో.. లేక పిల్లలతో వ్యాపారం చేసే బ్రోకర్లో తెలియదు కానీ... ఆ రెండేళ్ల బాలుడిని రూ.60 వేలకు కొనుకున్నారు. అనంతరం వచ్చిన డబ్బులు అయిపోయాయో ఏమో కానీ... అనంతరం నెల రోజుల పసికందును సైతం అమ్మకానికి పెట్టారు. ఫలితంగా ఒక వ్యక్తికి రూ.14 వేలకు పసి గుడ్డును విక్రయించారు. ఆ డబ్బుతో మత్తులో జోగుతున్నారు.
అయితే ఈ విషయం షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు తెలిసిందే. దీంతో తీవ్రస్థాయిలో ఆగ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా ఖాన్ తో పాటు పసి బిడ్డను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీ, డ్రగ్స్ ఏజెంట్ ఉషా రాథోడ్ లను అరెస్ట్ చేశారు.
ఇదే సమయంలో రెండోసారి అమ్మేసిన పసిపాపను ముంబైలోని అంధేరీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు... ముందుగా అమ్మేసిన రెండేళ్ల కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ ఏజెంట్తో పాటు, పసిపాపను కొన్న వ్యక్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారని తెలుస్తుంది.