మాజీ మంత్రులు ఇద్దరూ అవుట్ డేటెడేనా...!?

ఎన్ని పార్టీలు మారినా ఎంతగా ఆరాటపడినా ఆ మాజీ మంత్రుల జాతకాలు అయితే మారేది లేదా అన్న సంశయం వారి అనుచరులలో ఉంది.

Update: 2024-02-01 11:30 GMT

ఎన్ని పార్టీలు మారినా ఎంతగా ఆరాటపడినా ఆ మాజీ మంత్రుల జాతకాలు అయితే మారేది లేదా అన్న సంశయం వారి అనుచరులలో ఉంది. ఆ ఇద్దరే అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు. ఈ ఇద్దరికీ బ్రహ్మాండమైన పొలిటికల్ హిస్టరీ ఉంది. ఇద్దరూ మంత్రులుగా పనిచేసారు.

దాడి అయితే అనకాపల్లి అసెంబ్లీ నుంచి ఆరు సార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. కొణతాల ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అయిదేళ్ళ పాటు మంత్రిగా వైఎస్సార్ క్యాబినెట్ లో చేశారు. అంతే కాదు రెండు సార్లు ఎంపీగా మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఇలా ఈ ఇద్దరూ ఒకనాడు ఘనమైన రాజకీయ వైభవాన్ని చూసిన వారు.

కానీ గత దశాబ్దన్నరగా వారి రాజకీయ జాతకం తిరగబడుతోంది. ఈ ఇద్దరూ ఎన్ని పార్టీలు మారినా అధికార యోగం మాత్రం వరించడం లేదు. ముందుగా దాడి గురించి చెప్పుకుంటే ఆయన 2012 దాకా టీడీపీ ఎమ్మెల్సీగా శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ హోదాను అనుభవించారు. ఆ తరువాత టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీలోకి వచ్చారు.

అలా 2014లో తన కుమారుడిని పోటీకి దించినా ఓడిపోయారు. ఆ తరువాత మళ్లీ టీడీపీ వైపు చూశారు. 2019లో వైసీపీలోకి వచ్చినా టికెట్ దక్కలేదు. 2024 ఎన్నికల ముందు తిరిగి జై టీడీపీ అన్నారు. దాడి వీరభద్రరావు కుటుంబంతోసహా టీడీపీలో చేరినా ఆయన కుమారుడికి టికెట్ గ్యారంటీ అయితే ఇవ్వలేదు. పార్టీ కోసం పనిచేయమని చెబుతున్నారుట. అధికారంలోకి వస్తే ఏమైనా న్యాయం చేస్తామని ఒక హామీని ఇచ్చారని అంటున్నారు.

ఇక కొణతాల రామక్రిష్ణ విషయానికి వస్తే ఆయన తీరూ అంతే. 2009లో కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఓడిన కొణతాల వైఎస్సార్ మరణం తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అన్నీ తానై నడిపించారు కానీ వైసీపీ ఓడింది. ఆయన సొంత తమ్ముడు అనకాపల్లిలో ఓడారు. ఆ తరువాత వైసీపీకి దూరం అయిన కొణతాల మధ్యలో టీడీపీ వైపు చూశారు.

ఇక 2019లో మరోసారి వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తరువాత టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడింది. దాంతో కొణతాల రాజకీయానికి ఫుల్ స్టాప్ పడింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేద్దామని చూసినా టీడీపీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

ఇక 2024 ఎన్నికలు దగ్గరపడుతూనే ఆయన మరోసారి స్పీడ్ పెంచారు. ఈసారి టీడీపీ కాదని జనసేనలో చేరారు. పవన్ ని కలసి వచ్చారు. అనకాపల్లి ఎంపీ టికెట్ నే ఆయన సాధించాలని అనుకున్నారు. అయితే వస్తున్న వార్తలు బట్టి చూస్తే ఈ సీటు నుంచి టీడీపీ తరఫున దిలీప్ చక్రవర్తి పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు.

దాంతో కొణతాల ఆశలు నీరుకారుతున్నాయని అంటున్నారు. కొణతాల టీడీపీ జనసేనలను గెలిపించాల్సిన బాధ్యతనే కట్టబెడతారు అని అంటున్నారు. ఇప్పటికే ఏడు పదులకు చేరువలో ఉన్న కొణతాల రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు చాలా కీలకం అని చెబుతున్నారు. ఆయనకు టికెట్ దక్కకపోతే మాత్రం ఇక ఆయన ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరం కాక తప్పదని అంటున్నారు. ఇలా ఇద్దరు మాజీ మంత్రులూ 2024 ఎన్నికల ముందు చెరో పార్టీలో చేరినా కూడా రాజకీయంగా ఏమీ కలిసిరావడంలేదు అని వారి అనుచరులు వాపోతున్నారుట.





 


Tags:    

Similar News