పుతిన్ కు షాక్.. వెయ్యి కి.మీ. రష్యా భూభాగాన్ని అక్రమించిన ఉక్రెయిన్

నెలల స్థానే ఏళ్లకు వెళ్లిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-08-13 04:37 GMT

నెలల స్థానే ఏళ్లకు వెళ్లిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాల్ని రష్యా చేజిక్కించుకున్నట్లుగా జరిగిన వార్తలకు భిన్నంగా.. తాజాగా ఉక్రెయిన్ చెలరేగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యాకు చెందిన వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇంతవరకు సాగిన యుద్ధంలో ఇదే అతి పెద్ద ట్విస్టుగా చెప్పాలి.

ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు 900 రోజుల వరకు అయ్యింది. ఇప్పటివరకు లేని విధంగా.. గత వారంలోనే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొచ్చుకెళ్లింది. . రష్యాకు చెందిన కస్క్ రీజియన్ లోని భూభాగం ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. సదరు ప్రాంతంలో మానవతా సహాయాన్ని అందిస్తామన్న జెలెన్ స్కీ.. ఈ సందర్భంగా సైనిక సిబ్బందిని అభినందించారు. ఇరు దేశాల మధ్య సాగుతున్న పోరులో ఇదే పెద్ద ట్విస్టు. ఈ పరిణామం రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ కు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

తాజాగా తాము రష్యాకు చెందిన వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లుగా ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్ స్కీ వెల్లడించారు. అదే సమయంలో రష్యాలోకి తమ సేనలు అడుగు పెట్టిన విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించటం గమనార్హం. మరోవైపు ఈ అంశంపై పుతిన్ వాదన మరోలా ఉంది.

ఉక్రెయిన్ లోని డాన్ బాస్ లో మాస్కోను నిలువరించేందుకుచేసిన ప్రయత్నంగా పుతిన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు ఆరు నుంచి ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లుగా వెల్లడించారు. భవిష్యత్తులో యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే రష్యా చొరబాటును ఉక్రెయిన్ చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరుసైన్యాల పరస్పర దాడుల నేపథ్యంలో కస్క్ రీజియన్ లో ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. ఇంతకాలం తమను తాము రక్షించుకునే పంథాను అనుసరించిన ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాను ఆత్మరక్షణలోకి పడేలా దూసుకెళుతున్న వైనం కొత్త సమీకరణాలకు తెర తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News