ఏపీ ఎన్నికల మీద ఉండవల్లి మార్క్ సర్వే....!

ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తనదైన అనుభవంతో ఏపీ ఎన్నికల మీద సర్వే నివేదిక ఇచ్చారు.

Update: 2024-02-04 03:29 GMT

ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే సర్వేలు ఎవరికి వారు సిద్ధం చేసుకున్నారు. అనేక ప్రముఖ సంస్థల సర్వేలు వస్తున్నాయి. అలాగే చిన్న సంస్థల సర్వేలు కూడా వస్తున్నాయి. ఎవరి సర్వే వారిది అన్న సీన్ కూడా ఉంది. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తనదైన అనుభవంతో ఏపీ ఎన్నికల మీద సర్వే నివేదిక ఇచ్చారు.

ఏపీలో ఎవరు గెలుస్తారు అంటే ఆయన ఇద్దరికీ బలం ఉంది అన్నట్లుగా మాట్లాడడం విశేషం. టీడీపీ జనసేన కాంబో స్ట్రాంగ్ అంటూనే జగన్ వైసీపీ కాంఫిడెన్స్ కూడా వేరే లెవెల్ లో ఉందని ట్విస్ట్ ఇచ్చారు. మళ్లీ మేమే వస్తామని జగన్ ధీమాగా ఉన్నారు. ఆయన టీడీపీ జనసేన కూటమిని చూసి షేక్ అవడం లేదని ఉండవల్లి విశ్లేషించారు.

అదే సమయంలో జగన్ చెప్పిన మాటలను ఆయన నమ్మకాన్ని క్యాడర్ కూడా విశ్వసిస్తోందని మేము గెలిచేస్తామని వారూ భావిస్తున్నారు అని అన్నారు. సంక్షేమ పధకాలు తమను గెలిపిస్తాయన్న ధీమా వైసీపీలో కనిపిస్తోంది అని అన్నారు. అయితే పధకాలు పొందిన వారిలో తిరిగి ఎంతమంది వైసీపీకి ఓటు వేస్తారు అన్నది చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తాను అనేక ఎన్నికలను చూశానని మధ్యతరగతి వర్గాలు ఏ ప్రభుత్వాన్ని అయినా ద్వేషిస్తే దిగువ వర్గాలు అదే ప్రభుత్వానికి పట్టం కడతాయని అన్నారు. ఎందుకంటే ఆ సెక్షన్లు ఎపుడూ పై వర్గాలవారి మీద కొంత గుర్రుగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. అలా వైసీపీకి కలసి వస్తుందేమో అన్న భావన వ్యక్తం చేశారు.

అదే టైం లో మధ్యతరగతి ఉన్నత వర్గాలు మాట్లాడుతున్నాయని కింద వర్గాలు మౌనంగా అన్నీ గమనిస్తున్నాయని ఆయన అన్నారు. మరి వారు ఎవరికి ఓటు వేస్తారు అన్న దానిని బట్టే తీర్పు ఉంటుందని అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఏపీలో వైసీపీకి టీడీపీకి నలభై శాతం తగ్గకుండా సాలిడ్ ఓటు ఉందని అది వారికే పడుతుందని అన్నారు.

ఇక జనసేనతో టీడీపీకి పొత్తు అడ్వాంటేజ్ గా మారుతుందని అన్నారు. ఆ పార్టీకి గతసారి ఆరు శాతం ఓట్లు వచ్చాయని అవి ఇంకా పెరగవచ్చు అన్నారు. అది పది శాతం కంటే ఎక్కువగా ఉంటే టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని, అంతకు తగ్గితే వైసీపీ గెలవవచ్చు అని తన సర్వేని ఆయన వినిపించారు.

ఏపీలో సీట్ల షిఫ్టింగ్ మీద కూడా ఆయన మాట్లాడుతూ పాలిటిక్స్ లో గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుందని సీట్లు కోరుకున్న వారికి కోల్పోయిన వారికి అధినాయకత్వం నచ్చచెప్పే విధానం బట్టే అక్కడ పరిస్థితి ఉంటుందని అన్నారు. రాజకీయాల్లో ఎవరు ఎవరికీ త్యాగాలు చేయరని ఉండవల్లి అంటున్నారు.

ఇక రాజకీయాలు నానాటికీ వ్యాపారం అయిపోయిన తరువాత ప్రజాస్వామ్యంలో ఓటరు ఒక వస్తువు అయిపోయారని ఉండవల్లి హాట్ కామెంట్స్ చేశారు. ఓటరుని ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తారు అన్న దాని బట్టే వారిదే విజయం అన్నారు. మొత్తానికి పాము విరగకుండా కర్ర చావకుండా అన్నట్లుగా ఉండవల్లి సర్వే ఉందని అంటున్నారు.


Tags:    

Similar News