జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్‌’పై మరో ముందడుగు పడింది. కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-18 10:36 GMT

దేశంలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్‌’పై మరో ముందడుగు పడింది. కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భావించారు. అందుకు చాలా వరకు కసరత్తు కూడా చేశారు. పార్టీల అభిప్రాయం కోరారు. మిత్రపక్షాల నుంచి సైతం కొంత వ్యతిరేకత రావడంతో ఆ సమయంలో వాయిదా వేశారు.

అయితే.. అదే సందర్భంలో దేశంలో జమిలి ఎన్నికలపై సాధాసాధ్యాలను తెలుసుకునేందుకు అత్యున్నత కమిటీని వేశారు. దేశ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన కమిటీని వేశారు. ఆ కమిటీ ఇన్ని రోజులు స్టడీ చేసి ఇటీవలే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను పరిశీలించింది. ఇప్పటికే బీజేపీ కూడా మొన్నటి ఎన్నికల వేళ ఈ టర్మ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను అమలు పరుస్తామని చెప్పింది. ఆ మేరకు తన మేనిఫెస్టోలోనూ పొందిపరిచింది.

ఇక తాజాగా అత్యున్నత కమిటీ నివేదిక ఇవ్వడంతో మరో ముందడుగు పడింది. కమిటీ స్టడీ ప్రకారం.. దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యపడుతాయని పాజిటివ్ రిపోర్టు ఇచ్చింది. దీంతో హుటాహుటిని ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న శీతాకాల సమావేశాల్లోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది.

అయితే.. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన దేశంనలో 1980లోనే మొదటిసారి వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ లోక్‌సభతోపాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ.. అప్పట్లో అది సాధ్యపడలేదు. తాజాగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎట్టకేలకు కమిటీ నుంచి పాజిటివ్ రిపోర్టు రావడంతో ఇక ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News