ఏమిటీ స్టెల్త్ బాంబర్..?

ఓవైపు ఇజ్రాయెల్ తో హమాస్, హెజ్బొల్లా, ఇరాన్ లు యుద్ధం చేస్తుండగా.. ఉన్నపళంగా హౌతీ ఉగ్రవాదులపై విరుచుకుపడింది అమెరికా

Update: 2024-10-17 08:08 GMT

ఓవైపు ఇజ్రాయెల్ తో హమాస్, హెజ్బొల్లా, ఇరాన్ లు యుద్ధం చేస్తుండగా.. ఉన్నపళంగా హౌతీ ఉగ్రవాదులపై విరుచుకుపడింది అమెరికా. అదికూడా అలా ఇలా కాదు.. శక్తిమంతమైన స్టెల్త్ బాంబ్లరతో దాడి చేసింది. కొన్నాళ్లుగా ఎర్ర సముద్రంలో తమ నౌకలను టార్గెట్ చేస్తున్న హౌతీలను చావుదెబ్బ కొట్టే లక్ష్యంతో అమెరికా తొలిసారి బి-2 స్టెల్త్‌ బాంబర్లను ఎక్కుపెట్టడం గమనార్హం. దీంతో గురువారం తెల్లవారుజామున యెమెన్‌ కు స్టెల్త్ బాంబర్ల మోతతో తెల్లారినట్లైంది. తమ దాడుల్లో అమెరికా యెమెన్ ఆయుధ డిపోలను లక్ష్యం చేసుకుంది.

ఏమిటీ స్టెల్త్ బాంబర్..?

బాంబులంటే బాంబులే.. అయితే, బాంబులందు స్టెల్త్ బాంబులు వేరయా? అనే చెప్పాలి. సాధారణ యుద్ధ విమానాల (ఫైటర్‌ జెట్ల)తో పోలిస్తే అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్ అత్యంత శక్తిమంతమైనది. దీని ప్రత్యేకత ఏమంటే.. అత్యంత దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా తేలిగ్గా కొట్టేయడం. ఇంకా ఏమంటే.. అతిపెద్ద భారీ బాంబులనూ మోసుకెళ్తుంది. ఏడాది నుంచి హౌతీలు ఇబ్బంది పెడుతున్నా.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని అనుకుందో ఏమో కానీ.. అమెరికా బి-2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించలేదు.

ఇప్పుడు యుద్ధం ముదరడంతో..

హెజ్బొల్లా, హమాస్ లకు మద్దతుగా ఇజ్రాయెల్ పై ఇరాన్ కాలు దువ్వుతుండడం, హౌతీలూ దానికి కలిసిరానుండడంతో అమెరికా ఇక ఉపేక్షించాలని భావించలేదు. ఇప్పటివరకు సాధారణ ఫైటర్‌ విమానాలతోనే దాడులు చేసింది. ఇప్పుడు మాత్రం బి-2 స్టెల్త్ బాంబర్లను బరిలో దింపనున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాకస్థాయిలో ఉండడంతో అమెరికా దళాలు రంగంలోకి దిగుతున్నయి. థాడ్‌ గగనతల రక్షణ వ్యవస్థను కూడా మోహరిస్తోంది. దీంతోనే యెమెన్‌ లో హూతీలను దెబ్బకొట్టాలని దాడి చేసింది. ఐదు భూగర్భ ఆయుధ డిపోలను బి-2 స్టెల్త్‌ బాంబర్లు ధ్వంసం చేశాయి. ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి హౌతీలు ఆయుధాలను వీటిలోనే భద్రపరిచేవారు.

శత్రువులు ఆయుధాలను ఎంత లోతుగా దాచినా వదిలిపెట్టబోమని అమెరికా స్పష్టం చేసింది. తమ బి2 స్టెల్త్‌ బాంబర్‌ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దాడి చేయగలదని నిరూపించామని అమెరికా తెలిపింది. కాగా హౌతీలను కుప్పకూల్చాలని అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇకమీదట వారికి నూకలు చెల్లినట్లేనని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ వెల్లడించారు. ఎందుకంటే.. గాజాలో యుద్ధం మొదలైన నాటినుంచి హౌతీ లు ఎర్ర సముద్రంలోని నౌకలపై 100 డ్రోన్లు, క్షిపణి దాడులు చేశారు మరి.. వీటిలో అమెరికా నౌకలూ ఉన్నాయి.

Tags:    

Similar News