బ్రిటన్ ఎన్నికల్లో దుమ్ము లేపేసిన భారతీయులు!
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 650 స్థానాల పార్లమెంటులో ఆ పార్టీ ఏకంగా 412 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి అవసరమైన 326 స్థానాలను అధిగమించింది. ఇక ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలతో సరిపెట్టుకుంది. బ్రిటన్ ప్రధానిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు.
కాగా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లోనూ భారతీయ సంతతి వ్యక్తులు సత్తా చాటారు. ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న రిషి సునాక్ మరోసారి ఎంపీగా విజయం సాధించారు. రిషి సునాక్.. రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి మరోసారి విజయం గెలుపొందారు. ఆయనతో కలిపి మొత్తం 28 మంది భారత సంతతికి చెందినవారు ఎంపీలుగా గెలుపొందారు.
బ్రిటన్ పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ కు ఈ 28 మంది ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటి ఓడిపోయారు.
గెలుపొందిన 28 మంది భారతీయ సంతతి వారిలో లీసా నాండీ (44) బ్రిటన్ సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అలాగే మాజీ హోం శాఖ మంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్ గెలిచారు. భారత సంతతికే చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్ వెస్ట్ హెర్ట్ ఫోర్డ్ షైర్ నుంచి కన్సర్వేటివ్ నేత గగన్ మహీంద్ర, లీసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా విజయం సాధించారు. శివానీ రాజా భారత సంతతికే చెందిన రాజేశ్ అగర్వాల్‌పై గెలుపొందారు. కాగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన శైలేష్ వారా, అమీత్ జోగియాలు తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.
కాగా గెలుపొందిన 28 మంది భారత సంతతి వ్యక్తుల్లో అత్యధికులు అధికారం చేపట్టిన లేబర్ పార్టీ నుంచే ఉన్నారు. వీరిలో సీమా మల్హోత్రా (వాల్‌సాల్ నియోజకవర్గం), వాలెరీ వాజ్ (బ్లోక్స్ విచ్ నియోజకవర్గం), వాలెరో వాజ్ సోదరి కీత్ వాజ్, లీసా నాండీ (విగాన్ నియోజకవర్గం), నావెందు మిశ్ర, రదిమా విటోమ్ అత్యధిక మెజార్టీలు సాధించారు. అలాగే బ్రిటిష్ సిక్కులయిన.. ప్రీత్ కౌర్ గిల్, తన్ మంజిత్ సింగ్ ధేహి మరోసారి విజయ ఢంకా మోగించారు.
కాగా జాస్ అథ్వాల్, బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ ప్రీత్ ఉప్పల్, వారిందర్ జస్, గురిందర్ జోసన్, కనిష్క నారాయణ్, సోనియా కుమార్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జ్, కిరిత్ ఎంట్‌విజిల్, జీవన్ సంధేర్, సోజాన్ జోసెఫ్ లేబర్ పార్టీ తరఫున తొలిసారి ఎంపీలుగా విజయం సాధించారు.
కాగా లిబరల్ డెమోక్రాట్ పార్టీ తరఫున మునిరా విల్సన్ మరోసారి గెలుపొందారు.