ఉప్పలమ్మా.. నీ సాహసానికి హేట్సాఫ్
క్వారీ గుంతకు సమీపంలోనే నివాసం ఉండే నెరుసు ఉప్పలమ్మ బాలికల ఆర్తనాదాలు విని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. వెంటనే క్వారీ గుంతలోకి దిగిన ఆమె.. మునిగిపోతున్న అనూష.. శ్రతి.. గౌతమిలను ఒడ్డుకు చేర్చింది.
నీట మునిగిన ముగ్గురు బాలికల్ని తెగువతో కాపాడిన ఉప్పలమ్మ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఆమె చేసిన సాహసం గురించి విన్న వారంతా ఆమె సాహసానికి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. బట్టలు ఉతుక్కోవటానికి క్వారీ నీటి గుంతలోకి దిగిన బాలికలు ప్రమాదంలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్న వేళ.. తాను ఒక్కతే నీటి గుంతలోకి దిగిన ముగ్గురు బాలికల ప్రాణాల్ని కాపాడింది. అయితే.. ఈ ఉదంతంలో అప్పటికే ఒక బాలిక నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
మహబూబాబాద్ పట్టణ శివారులోని గౌతమ బుద్ధ కాలనీకు చెందిన వీరన్న.. కుమారి దంపతులు మూడేళ్లుగా ఉంటున్నారు. శనివారం వారు కూలిపనులకు వెళ్లగా వారి ముగ్గురు కుమార్తెలు.. వీరన్న సోదరుడి కుమార్తె కలిసి సమీపంలోని క్వారీ నీటి గుంతలోకి బట్టలు ఉతుక్కోవటానికి వెళ్లారు. అనూహ్య రీతిలో నలుగురు నీళ్లల్లోకి జారిపోయారు. వారు భయంతో కేకలు వేయసాగారు.
క్వారీ గుంతకు సమీపంలోనే నివాసం ఉండే నెరుసు ఉప్పలమ్మ బాలికల ఆర్తనాదాలు విని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. వెంటనే క్వారీ గుంతలోకి దిగిన ఆమె.. మునిగిపోతున్న అనూష.. శ్రతి.. గౌతమిలను ఒడ్డుకు చేర్చింది. అయితే..అప్పటికే వీరన్న రెండో కుమార్తె నిఖిత మాత్రం గుంత మధ్యలోకి వెళ్లి.. నీటి అడుగుకు చేరిపోవటంతో ఆమె బయటకు రాలేకపోయింది.
చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని వారిని వెలికి తీయగా.. అప్పటికే బాలిక చనిపోయినట్లుగా గుర్తించారు. సమయానికి స్పందించిన ఉప్పలమ్మ కారణంగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె సాహసం గురించి తెలిసిన వారంతా ఆమెను అభినందిస్తున్నారు. ఆపదలో ఉన్న వేళ.. ఇంత పెద్ద సాహసం చేయటం నిజంగానే అద్భుతమైన అంశంగా చెప్పక తప్పదు.