అమెరికాలో బహిష్కరణ.. ఇండియాలో అరెస్టు..
అయితే తాజాగా అమృతసర్ విమానాశ్రయానికి వచ్చిన మూడో విమానంలో ఇద్దరు హత్య కేసు నిందితులు ఉన్నారు.
అమెరికా డీపోర్టలైజేషన్ వ్యవహారంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. అక్రమ మార్గాల్లో అమెరికా చేరుకున్న చొరబాటుదారులను ఆ దేశం బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారివారి స్వదేశాలకు పంపుతున్నారు. ఇలా మన దేశం నుంచి అమెరికా వెళ్లిన 18 వేల మందిని తిరిగి పంపేందుకు ఆ దేశం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు మూడు ప్రత్యేక సైనిక విమానాలు అమెరికా నుంచి భారత్ కు వచ్చాయి. ఇలా మొత్తం మూడు విమానాల ద్వారా 332 మంది భారతీయులను అమెరికా పంపించింది. అయితే తాజాగా అమృతసర్ విమానాశ్రయానికి వచ్చిన మూడో విమానంలో ఇద్దరు హత్య కేసు నిందితులు ఉన్నారు. దీంతో వీరు దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను ఆ దేశం బహిష్కరిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విదేశీ అక్రమ వలసదారులపై బహిష్కరణ వేటు వేశారు. మన దేశం నుంచి కూడా వేలాది మంది డంకీ మార్గాల్లో అమెరికా చేరుకున్నారు. ఇప్పుడు అమెరికా బహిష్కరణ వేటుతో వారంతా తిరిగి స్వదేశాలకు వస్తున్నారు. అమెరికా నుంచి రక్షణ విమానాల ద్వారా మన దేశానికి వస్తున్నవారు చాలా మంది ఏజెంట్ల మోసాలకు బలైన వారే. కానీ, తాజాగా అమృతసర్ చేరుకున్న విమానంలో ఓ ఇద్దరు మాత్రం మహా కిలాడీలుగా పోలీసులు చెబుతున్నారు.
2023లో పటియాలాలో ఓ హత్య చేసిన ఇద్దరు నిందితులు.. ఆ తర్వాత పరార్ అయ్యారు. వీరి కోసం పోలీసులు చాలా చోట్ల గాలించారు. ఇలా రెండేళ్లుగా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా, వారు ఎక్కడున్నారో తెలియలేదు. అయితే తాజాగా అమెరికా నుంచి వస్తున్న విమానంలో ఆ ఇద్దరి పేర్లు చూసి పోలీసులు కంగుతిన్నారు. దీంతో వారు దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేశారు. అమెరికా బహిష్కరణ వేటుతో ఇండియాలో ఓ హత్య కేసు పరిష్కారమవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పటియాలాకు చెందిన సందీప్, ప్రదీప్ సమీప బంధువులు. ఈ ఇద్దరూ కలిసి 2023 జూన్ 26న పటియాలాలో ఓ హత్య చేసి పారిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత పోలీసుల కళ్లు కప్పి అమెరికా పారిపోయిన నిందితులు ఆదివారం అనూహ్యంగా దొరికిపోవడం విశేషం. ఈ ఇద్దరి అరెస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.