యూఎస్ లో ఉత్తర కొరియా టెకీలు... కిమ్ తెలివే తెలివి!

ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా నార్త్ కొరియాలో నిధులకు కటకట ఏర్పడింది. దీంతో నిధుల కోసం ఆ దేశం వైవిద్యమైన ప్లాన్ చేసింది.

Update: 2023-11-22 05:19 GMT

ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా నార్త్ కొరియాలో నిధులకు కటకట ఏర్పడింది. దీంతో నిధుల కోసం ఆ దేశం వైవిద్యమైన ప్లాన్ చేసింది. అమెరికాలోని ఒక సైబర్ భద్రతా సంస్థ వద్ద లభించిన పత్రాల ప్రకారం ఈ కీలక విషయం వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు పశ్చిమ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కిమ్ పనులు ఇలానే ఉంటాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

అవును... యుఎస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న వేలాది మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు కొన్నేళ్లుగా తమ వేతనాలలో మిలియన్ల డాలర్లను బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో ఉపయోగించడం కోసం ఉత్తర కొరియాకు రహస్యంగా పంపారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు తెలిపారు.

అమెరికాలోని సెయింట్ లూయిస్‌ లోని కంపెనీలతో రిమోట్‌ గా పనిచేయడానికి ఉత్తర కొరియా పంపిన, ఒప్పందం చేసుకున్న ఐటి ఉద్యోగులు.. ఉద్యోగాలు పొందడానికి తప్పుడు గుర్తింపులను ఉపయోగిస్తున్నారని న్యాయ శాఖ తెలిపింది. వారు సంపాదించిన డబ్బు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమానికి మళ్లించబడిందని ఎఫ్‌.బి.ఐ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సెయింట్ లూయిస్ ఎఫ్‌.బి.ఐ కార్యాలయానికి ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్న ప్రత్యేక ఏజెంట్ జే గ్రీన్‌ బెర్గ్ మాట్లాడుతూ... ఏదైనా కంపెనీ ఫ్రీలాన్స్ ఐటి ఉద్యోగులను నియమించుకునేముందు... ఎవరిని నియమించుకుంటున్నారో ధృవీకరించడానికి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. గుర్తింపులను దాచడం కష్టతరం చేయడానికి రిమోట్ ఐటి ఉద్యోగులతో యజమానులు అదనపు క్రియాశీలక చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది.

ఈ విధంగా... ఉత్తర కొరియా ప్రభుత్వం వేలాది మంది నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను ప్రధానంగా చైనా, రష్యాలలో నివసించడానికి అమెరికా, ఇతర ప్రాంతాల నుండి ఫ్రీలాన్స్ రిమోట్ ఉద్యోగులుగా నియమించుకునే లక్ష్యంతో వారిని పంపించిందని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆరోపించారు! ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ ఐటీ ఉద్యోగులు తమ వేతనాలలో సంవత్సరానికి మిలియన్ల డాలర్లను సంపాదించారని వెల్లడించింది.

ఇక, కొన్ని సందర్భాల్లో.. ఉత్తర కొరియా ఉద్యోగులు కంప్యూటర్ నెట్‌ వర్క్‌ లలోకి చొరబడ్డారని.. వారిని నియమించుకున్న కంపెనీల నుండి సమాచారాన్ని దొంగిలించారని న్యాయ శాఖ తెలిపింది. భవిష్యత్తులో హ్యాకింగ్, దోపిడీ పథకాలకు కూడా వారు యాక్సెస్‌ ను కొనసాగించారని ఏజెన్సీ తెలిపింది. ఉత్తర కొరియా టెకీలు తమ ఇంటి వైఫై కనెక్షన్‌ లను ప్రత్యేకంగా తీసుకోకుండా... అమెరికన్లకు చెందినవాటిని కొంత సొమ్ము చెల్లించివాడుతున్నారని... ఇలా వారు యూఎస్ లో పనిచేస్తున్నట్లు తెలియకుండా ఉండటానికి వివిధ పద్ధతులను ఉపయోగించారని గ్రీన్‌ బర్గ్ వెల్లడించారు.

Tags:    

Similar News