హిరోషిమా కంటే 24 రెట్లు... కొత్త అణుబాంబు సిద్ధం చేయనున్న యూఎస్!

అవును... రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా హిరోషిమా నగరంపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్‌ ప్రకటించింది.

Update: 2023-11-01 01:30 GMT

హిరోషిమా, నాగసాకి పేర్లు ఈ ప్రపంచం మరిచిపోలేని సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నగరాలపై ప్రయోగించబడిన భయంకరమైన అణుబాంబు వేల మందిని పొట్టనపెట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతాన్ని దశాబ్దాలపాటు కోలుకోనీయకుండా చేసింది. పచ్చిక కనిపించకుండా మాడి మసి చేసింది. ఇప్పటికీ ఆ సంఘటన పేరెత్తితే జపాన్ ప్రజలు ఒక్కక్షణం మౌనంగా మారిపోతారు!

కారణం... ప్రపంచ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం అంతా ఒకెత్తు అయితే... హిరోషిమా, నాగసాకీలపై జరిగిన అణుయుద్ధం మరొకెత్తు అని అంటారు! ఈ భూమిపై జీవం ఉన్నంతకాలం ఈ రెండు నగరాలు దాదాపు అందరికీ గుర్తుంటాయని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ సమయంలో అంతకంటే మరింత బలమైన అణుబాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది.

అవును... రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా హిరోషిమా నగరంపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్‌ ప్రకటించింది. ఈ మేరకు బీ61 కొత్త వేరియంట్‌ న్యూక్లియర్‌ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్.ఎన్.ఎస్.ఏ.) సహకారంతో ఈ అణ్వాయుధాన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది.

ఈ క్రమంలో ఆ ఆలోచన వారికి రావడానికి గల కారణాలు, ఆవశ్యకతలను అగ్రరాజ్యం ప్రపంచానికి వెల్లడించింది. ఇందులో భాగంగా.. నిరంతరం మారుతున్న ప్రపంచంలో మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే ఈ అణుబాంబుతో కష్టతరమే అవుతుందని పేర్కొంది. అయితే... దీన్ని తయారు చేయాలనే నిర్ణయం ఒక్కసారిగా తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా దీని తయారీ అవసరమైందని చెబుతున్న అగ్రరాజ్యం... దీనికి సంబంధించిన ఆమోదం అంశం చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు తెలిపింది! అయితే... ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని వెయ్యికిపైగా పెంచుకునేందుకు చైనా సిద్ధమవుతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ దిశగా ఆలోచిస్తుందని అంటున్నారు.

కాగా... రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945 ఆగస్టులో జపాన్‌ లోని హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. అలా నాడు హిరోషిమాపై ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలోటన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు 25 కిలోటన్నుల శక్తిని విడుదల చేసిందని చెబుతారు.

ఈ క్రమంలో... ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ బీ61-13 అణుబాంబు మాత్రం సుమారు 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు చెబుతున్నారు. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువన్న మాట! దీన్ని బట్టి ఈ అణుబాంబు ప్రయోగం ఏ దేశంపై అయినా జరిగితే ఊహకందని విధ్వంసం అవుతుందనడంలో సందేహం లేదు!!

Tags:    

Similar News