అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ఆ ఇద్దరి మధ్కనే!
అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలో నిలవగా.. ఆయనపై పోటీకి రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది పోరు లెక్క తేలింది. గత ఎన్నికల్లో ఏ ఇద్దరు అయితే అధ్యక్ష ఎన్నికల్లో తలపడ్డారో.. వారే ఈసారీ ఎన్నికల బరిలో నిలిచారు. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలో నిలవగా.. ఆయనపై పోటీకి రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో తుది పోరుకు అవసరమైన డెలిగేట్ల ఓట్లను ఈ ఇద్దరు పొందటంతో వారి మధ్య పోరు ఫైనల్ అయ్యింది. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో బైడెన్ గెలుపొందారు. దీంతో ఇప్పటివరకు ఆయన 2099 డెలిగేట్ల ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆయనకు బదులుగా బరిలో నిలవాలనుకున్న ఆయన పార్టీ నేతలకు అందనంత దూరంలో ఆయన డెలిగేట్ల ఓట్లు ఉండటం గమనార్హం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలంటే డెలిగేట్ల ఓట్ల అవసరం తప్పనిసరి. మొత్తం 3933 డెలిగేట్ల ఓట్లలో 1968 ఓట్లు వస్తే అభ్యర్థిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేశారు. మరోవైపు ట్రంప్ సైతం ఆ మార్క్ ను అధిగమించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవాలంటే కనీసం 1215 ఓట్లు అవసరం కాగా.. ట్రంప్ ఇప్పటికే 1228 ఓట్లను సొంతం చేసుకున్నారు.
ఇక.. ఈ ఇద్దరి అభ్యర్థిత్వాల్ని ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ తరఫు బైడెన్ ను అభ్యర్థిగా ఆగస్టులో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో ప్రకటిస్తారు. అదే విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ను ఫైనల్ చేస్తూ ప్రకటనను జులైలో మిల్ వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారు. దీంతో 2020 నాటి ప్రత్యర్థులే తాజా ఎన్నికల్లో రిపీట్ అవుతారని చెప్పాలి.
గత ఎన్నికల సమయానికి ట్రంప్ మీద ఎలాంటి కేసులు లేవు కానీ.. ఇప్పుడు మాత్రం ఆయనపై 91 కేసులు ఉన్నాయి. అదేసమయంలో బైడెన్ ప్రసంగాల్లోనూ ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? అతివాదులకు అధికారాన్ని అప్పగిద్దామా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్రంప్ స్పందిస్తూ.. 'చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్ ను గద్దె దింపాల్సిన సమయం వచ్చేసింది' అంటూ ఘాటుగా రియాక్టు అవుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ కు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.