కెమేరాలు కళ్లు చూస్తుంటాయి..జాగ్రత్త లేకుంటే ఎలా ఉత్తమ్?

గుంభనంగా ఉండాల్సిన వేళ.. ముఖంతోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ అంతులేని నిరాశను ప్రదర్శించటం.. నీరసంగా కనిపించటం అంతగా బాగోదు.

Update: 2023-12-06 04:10 GMT

మనసులో ఏముందో ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు. గుంభనంగా ఉండాల్సిన వేళ.. ముఖంతోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ అంతులేని నిరాశను ప్రదర్శించటం.. నీరసంగా కనిపించటం అంతగా బాగోదు. ఈ విషయాన్ని ఉత్తమ్ ఎందుకు మర్చిపోయారో అర్థం కానిది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన వేళ.. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన ఉత్తమ్.. తన సామర్త్యం ఎంత? తన సత్తా ఎంత? అన్న విషయాన్ని ఆయన మర్చిపోయారన్న విమర్శ వినిపిస్తోంది. ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వేళ 2018లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని అన్న విషయాన్ని మర్చిపోయావా? అన్న మాటల పలువురి నోట వినిపిస్తోంది.


సీఎం కుర్చీని ఆశించటంపై ఉత్తమ్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. అయినప్పటికి.. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి వ్యవహరించిన ఆయన.. ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసి మరీ భంగపడిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీఎల్పీ నేతగా (అంటే ముఖ్యమంత్రిగా) రేవంత్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసిన విషయాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించటం తెలిసిందే.

ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఉత్తమ్.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించే వేళలో.. నీరసంగా.. నిరాశతో ఉన్న ముఖంగా కామ్ గా ఉండిపోవటం.. దీనికి సంబంధించిన ఎక్స ప్రెషన్ కెమేరా కళ్లకు చిక్కటంతో ఆయన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మనసులోని బాధను అన్ని సందర్భాల్లోనూ ముఖంలో చూపించటం బాగోదు. ఈ చిన్న విషయాన్ని ఉత్తమ్ మిస్ కావటం ఒక ఎత్తు అయితే.. కెమేరా కళ్లు తనను చూస్తుంటాయన్న విషయాన్ని ఉత్తమ్ ఎలా మిస్ అవుతారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.

Tags:    

Similar News