ఎమ్మెల్సీ పోరు.. జ‌న‌సేన‌కు స‌వాలేనా..!

ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే

Update: 2024-08-05 16:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష వైసిపి ఇప్పటికే తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. బలమైన సామాజిక వర్గం, ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు గ్రూపు రాజకీయాలను సైతం మేనేజ్ చేయగలిగే సామర్థ్యం సత్యనారాయణ సొంతం. ఈ నేపథ్యంలో ఆయనను ఎంపిక చేయటం రాజకీయంగా వైసీపీకి కలిసి వస్తుందని ఒక అంచనా.

పైగా సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పలుకుబడి వంటివి కూడా కలిసి వస్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబం మొత్తం ఓడిపోవడం కారణంగా ఏర్పడిన సానుభూతి కూడా ఆయనకు కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నిక‌ రావడానికి కారణమైన జనసేన ఇప్పుడు ఏం చేస్తుంద‌నేది ప్ర‌శ్న‌. గతంలో వైసిపి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్ళి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు ఈ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.

సుమారు 3 సంవత్సరాల పాటు ఈ పదవి అనుభ‌వించే అవకాశం ఉంది. అయితే ఈ సీటును పంచుకునే విషయంలో కూటమి వర్గాల మ‌ధ్య‌ భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. జనసేన పార్టీ ఈ సీటును కోరుతున్నట్టు టిడిపి నాయకులు చెప్తున్నారు. కానీ విశాఖలో బలం పెంచుకోవాలంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదని టిడిపి నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా సీటు కోసం చిన్నపాటి యుద్ధమే జరుగుతుందని చెప్పాలి.

ఇక ఎవరికి సీటు ఇచ్చినా స్థానిక సంస్థల కోటాలో గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీ కాదనే అంటున్నారు. కార్పొరేషన్ లో వైసీపీకి బలమైన నాయకులు ఉండటం, అదేవిధంగా పార్టీ పూర్తిగా ఓడిపోయిన నేపథ్యంలో ఏర్పడిన సింప‌తీ వంటివి కూడా సత్యనారాయణకు పని చేస్తుందని ఒక లెక్క. ఇక‌, కూట‌మి నాయ‌కుల విష‌యానికి వ‌స్తే.. నేనంటే నేనే పోటీ చేస్తానని తెర‌మీదికి వ‌స్తున్నారు. దీంతో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు అసంతృప్తితో ఉంటార‌నేది ఖాయం. మొత్తంగా చూస్తే వైసీపీలో ఉన్నంత జోష్ కూట‌మిలో క‌నిపించ‌డం లేదు.

పైగా జనసేనకి ఈ టికెట్‌ను గెలిపించుకుని తీరాల్సిన అవసరం కూడా ఏర్పడిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదు. త‌మ నాయ‌కుడు వ‌దిలేసిన సీటును ద‌క్కించుకోవాల‌ని క్షేత్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతున్నా.. పార్టీ మాత్రం ఇంకా దృష్టి పెట్ట‌లేదు. దీంతో ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News