వేలంటైన్స్ డే వీక్: బజ్ లేదా.. డబ్బులు లేవా?
ఇదే సమయంలో ఆ అమ్మాయి / అబ్బాయి ఫ్రెండ్స్ ద్వారా ఆ రోజున అవతలి వ్యక్తి వేసుకునే డ్రెస్ కలర్ తెలుసుకునే ప్రయత్నంలో బిజీగా ఉండేవారు మరికొందరు
మిగిలినవారి సంగతి కాసేపు పక్కనపెడితే... ఎయిటీస్ (80వ దశకంలో) పుట్టిన వారిని కాస్త కదిపితే వేలంటైన్స్ డే రోజు, దానికోసం సుమారు రెండు వారాల ముందు నుంచీ జరిగే ప్రిపరేషన్, మెంటల్ టెన్షన్ గురించి వీలైనంత క్లియర్ గా చెప్పే అవకాశం ఉంది! ఈ గ్యాప్ లో సొంతంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసేవారు ఒకరైతే... ఏకంగా అప్పటికప్పుడు ఒక గులాబీ అంటు పట్టుకొచ్చి పెరట్లో పాతేవారు మరొకరు!
ఇదే సమయంలో ఆ అమ్మాయి / అబ్బాయి ఫ్రెండ్స్ ద్వారా ఆ రోజున అవతలి వ్యక్తి వేసుకునే డ్రెస్ కలర్ తెలుసుకునే ప్రయత్నంలో బిజీగా ఉండేవారు మరికొందరు. ఇక కాస్త ఇద్దరికీ ఒకరే హీరో ఫేవరెట్ అయ్యి, ఆ సమయంలో అతని సినిమా విడుదలవుతుందంటే.. టిక్కెట్స్ కోసం ప్రయత్నించేవారు ఒకరైతే... ఏఆర్ రెహమాన్, ఇళయ రాజా లవ్ సాంగ్స్ రికార్డ్ చేసి ఆ కేసెట్ ని గిఫ్ట్ ప్యాక్ చేసేవారు మరొకరు.
ఈ క్రమంలో అప్పటికే ఇంగ్లిష్ సినిమాల ప్రభావంతో మరీ అప్ డేట్ అయ్యి ఉన్నవారు...
ఫిబ్రవరి 7 న రోజ్ డే
ఫిబ్రవరి 8 న ప్రపోజ్ డే
ఫిబ్రవరి 9 న చాక్లెట్ డే
ఫిబ్రవరి 10 న టెడ్డీ డే
ఫిబ్రవరి 11 న ప్రామిస్ డే
ఫిబ్రవరి 12 న హగ్ డే
ఫిబ్రవరి 13 న కిస్ డే
వంటివి కూడా ప్లాన్ చేసుకుని ఫిబ్రవరి 14న ఫైనల్ గా వేలంటైన్ డే సెల్బ్రేషన్స్ చేసుకునేవారు. అలాంటి అవకాశాలు అప్పటికే లవ్ లో ఉన్నవారికి సూటయ్యేవి కానీ... ఆ రోజునే తొలిసారి ప్రపోజ్ చేసేవారికి మాత్రం వీలయ్యేవి కావు పాపం!!
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే... ఒకప్పుడు ప్రేమికుల రోజు అంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ ఉండేది! పుట్టినరోజు, సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాంటివాటన్నింటినీ తలదన్నేలా ఫిబ్రవరి 14 కోసం పరితపించేవారు కొంతమంది యువత! ఇదే సమయంలో ఆ రోజు పాఠశాలలకూ, కళాశాలల్కూ సెలవు రోజు కాకూడదని చాలా మంది ప్రార్ధనలూ, పూజలూ చేసేవారన్నా అతిశయోక్తి కాదేమో! అయితే... ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అవును... ఒకప్పుడు వేలంటైన్స్ డే నాటి సందడి ఇప్పుడు చాలా తగ్గిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే... ప్రేమపై శ్రద్ధ తగ్గిందా.. ఆరోజే ఎందుకనే స్థాయిలో అప్ డేట్ అయ్యారా.. లేక, లివ్ ఇన్ టుగెథర్ కాలంలో కూడా ఫిబ్రవరి 14వరకూ ఎదురు చూసి, ప్లాన్ చేసుకుని, ప్రేమను వ్యక్తపరిచడం.. ఆ రోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం.. అప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా ఇద్దరూ ఒకేచోట కలవాలని ప్లాన్స్ చేసుకోవడాన్ని లైట్ తీసుకున్నారనుకోవాలా?
తెలియదు కానీ... 2024 తాజాగా వేలంటైన్ డే వీక్ వచ్చి మూడు నాలుగు రోజులు అవుతున్నా.. మరో మూడు నాలుగు రోజులు మాత్రం ఫెబ్ ఫోర్టీంత్ కు ఉందన్ని తెలుస్తున్నా.. ఆ సందడి మాత్రం కనిపించడం లేదు! అయితే ఈ సమయంలో ఈ సందడి కనిపించకపోవడానికి యువత వద్ద డబ్బులు లేకపోవడం కూడా ఒక కారణం అనే చర్చ నెట్టింట చర్చకు వచ్చింది.
ఇందులో భాగంగా ప్రస్తుతం యువత వద్ద సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో డబ్బులు లేవని.. ఇదే సమయంలో లే ఆఫ్ లు కూడా వెంటాడుతుండటం కూడా అందుకు ఒక కారణమనే అభిప్రాయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. లే ఆఫ్ అని అనుకున్నా.. అటు తిరిగి ఇటు తిరిగి అది కూడా డబ్బుతో కూడుకున్నదే కావడంతో... ఈ చర్చ మరింత బలంగా జరుగుతుంది! నిజం చెప్పాలంటే... వేలంటైన్స్ డే కి సందడి చేయడానికి.. డబ్బు లేకపోవడానికి కారణం ఉంటుందా అంటే... ఈ రోజుల్లో ఉంటుందనేవారే ఎక్కువగా ఉండటం గమనార్హం!!