బిగ్‌ బ్రేకింగ్‌.. వైసీపీకి మరో షాక్‌.. ఎంపీ రాజీనామా!

ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు

Update: 2024-01-13 13:41 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట «అధికార ౖవైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ ఎంపీ, జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి తన పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన బందరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణపై విజయం సాధించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కు సన్నిహితుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వల్లభనేని బాలశౌరి 2004లో తొలిసారి గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఇక 2009లో ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిపై కేవలం 1607 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాలశౌరి తరఫున నాడు ఎన్నికల్లో అరంగేట్రం చేసిన వైఎస్సార్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌ ప్రచారం చేయడం విశేషం.

ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. బాలశౌరిపై టీడీపీకి చెందిన గల్లా జయదేవ్‌ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి కృష్ణా జిల్లా బందరు నుంచి బరిలోకి దిగి వైసీపీ తరఫున విజయం సాధించారు.

వల్లభనేని బాలశౌరి కాపు సామాజికవర్గానికి చెందినవారు. తన పొలిటికల్‌ కెరీర్‌ లో నాలుగుసార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఏకైక నేత కూడా బాలశౌరే కావడం గమనార్హం. మొత్తం మీద నాలుగుసార్లు (రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ) పోటీ చేసిన బాలశౌరి రెండుసార్లు గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందగా, మరోసారి వైసీపీ తర ఫున విజయం సాధించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ తరఫున బందరు ఎంపీగా బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు ఆయన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తో సమావేశమవుతారని మీడియాలో కథనాలు వచ్చాయి. బాలశౌరికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ప్రస్తుతం బందరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి, వల్లభనేని బాలశౌరికి మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. స్థానిక ఎంపీగా బాలశౌరి పర్యటనను పేర్ని నాని వర్గీయులు పలుమార్లు అడ్డుకున్నారు. అలాగే బందరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అవనిగడ్డలోనూ స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి చంద్రశేఖర్‌ కు, బాలశౌరికి మధ్య విభేధాలు ఉన్నాయి. అవనిగడ్డలో సైతం ఎమ్మెల్యే వర్గీయులు బాలశౌరి పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై బాలశౌరి సీఎం వైఎస్‌ జగన్‌ కు ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బాలశౌరి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

అదేవిధంగా బందరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని.. ఈసారి తాను అసెంబ్లీకి వెళ్తానని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో బందరు వైసీపీ అభ్యరిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు జగన్‌ టికెట్‌ కేటాయించారు. దీంతో బాలశౌరి అసంతృప్తి చెందారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణాల రీత్యానే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News