హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ... ఇదే కారణం!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ.. హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-08-14 06:54 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ.. హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో... ఈ పిటిషన్ పై నేడు విచారణ చెపట్టనుంది ఏపీ హైకోర్టు. దీంతో... ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

అవును... గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పోలీసులు ఆ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. ఈ మేరకు ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు కృష్ణాజిల్లా పోలీసులు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల వల్లభనేని వంశీ అనుచరులను అరెస్ట్ చేశారని, వారితో పాటు వంశీని అరెస్ట్ చేశారని హంగామా నడిచింది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు హైదరబాద్ చేరుకున్నాయని ప్రచారం జరిగింది. అయినప్పటికీ వంశీ చివరి నిమిషంలో తప్పించుకున్నారని, దొరకలేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు.

నాడు పార్టీ ఆఫీసుపై జరిగిన దాడి విషయంలో మూందుగా అరెస్ట్ చేయాల్సింది వంశీనే అంటూ టీడీపీ నేతలు మండిపడుతుండగా... ఇది పూర్తిగా కక్షపూరిత చర్యల్లో భాగంగా పెట్టిన కేసులని వైసీపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. మరోపక్క రెడ్ బుక్ జాబితాలో వంశీ పేరు కూడా ప్రముఖంగా ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారాలు జరుగుతున్నాయి.

కాగా... 2009లో టీడీపీ టిక్కెట్ పై విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వంశీ.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచే గెలిచారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత ఆయన టీడీపీని వదిలి అధికార వైసీపీకి జైకొట్టారు. అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో అవి శృతిమించాయనే కామెంట్లూ వినిపించేవి.

Tags:    

Similar News