వందే భారత్‌.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదే!

దేశంలో వేగవంతమైన ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-08 11:30 GMT

దేశంలో వేగవంతమైన ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గంటకు కనీసం 160 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు వందే భారత్‌ అని పేరు పెట్టారు. ఎడాపెడా దేశమంతా ఈ రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే వేగవంతమైన ప్రయాణం మాత్రం వీటితో సాకారం కావడం లేదంటున్నారు. గంటకు కనీసం 160 కి.మీ వేగం సంగతి దేవుడెరుగు సాధారణ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లయిన వివేక్‌ ఎక్స్‌ ప్రెస్, జనశతాబ్ధి వంటి రైళ్ల వేగాన్ని కూడా వందే భారత్‌ రైళ్లు అందుకోలేకపోతున్నాయని తెలుస్తోంది. వందే భారత్‌ రైళ్ల వేగం కేవలం గంటకు 80 కి.మీ మించడం లేదని అంటున్నారు.

వందే భారత్‌ రైళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ మౌలిక రంగాన్ని ఇవి మలుపుతిప్పుతాయని పేర్కొంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడ వందే భారత్‌ రైలు మొదలయినా దాన్ని ప్రధాని మోదీనే అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఇవి నిర్దేశిత వేగాన్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయని వెల్లడైంది.

ఈ మేరకు మధ్యప్రదేశ్‌ కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సామాజిక కార్యకర్త వందే భారత్‌ రైళ్ల వేగం గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. ఆయనకు సమాధానం ఇచ్చిన అధికారులు వందేభారత్‌ రైళ్ల సగటు వేగం 2020–21లో 84.48 కిలోమీటర్ల నుంచి 2023–24 నాటికి 76.25 కిలోమీటర్లకు తగ్గిపోయిందని తెలిపారు.

వందేభారత్‌ రైళ్ల సరాసరి వేగం 2020-21లో గంటకు 84.48 కి.మీ ఉండగా 2022–23 నాటికి ఆ వేగం 81.38 కిలోమీటర్లకు, 2023–24 నాటికి 76.25 కి.మీ.లకు తగ్గిపోయింది.

కేవలం వందే భారత్‌ రైళ్లే కాకుండా ఇతర రైళ్ల వేగం కూడా తగ్గిపోయిందని తెలిపారు. ట్రాక్‌ ల పునరుద్ధరణ, లైన్ల విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల రైళ్ల వేగం తగ్గిందని అధికారులు వెల్లడించారు.

సెమీ హైస్పీడ్‌ రైళ్లయిన వందే భారత్‌ రైళ్లను తొలిసారి 2019 ఫిబ్రవరి 15న అందుబాటులోకి తెచ్చారు. అయితే గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడానికి తగ్గట్టు ట్రాక్‌ ల నిర్మాణం, పునరుద్ధరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదనే విమర్శలున్నాయి. దీంతో వందేభారత్‌ రైళ్ల వేగం గరిష్టంగా గంటకు 80 కి.మీలకు కూడా చేరుకోవడం లేదు.

వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టి ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికే వాటికి తగ్గట్టు ట్రాక్‌ ల నిర్మాణం అందుబాటులోకి రాలేదు. ఇంకా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో ట్రాక్‌ ల నిర్మాణం చేపట్టి, వాటిని ఆధునికీకరిస్తే గంటకు 250 కి.మీ వేగంతో వందే భారత్‌ రైళ్లు ప్రయాణిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 రూట్లలో 102 వందే భారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి.

Tags:    

Similar News