ప్రచారం చేస్తూ.. స్పృహ కోల్పోయిన వైసీపీ నాయకురాలు!
దీంతో వారు ఎండబారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వైసీపీకి చెందిన సీనియర్ నాయకురాలు.. ఎంపీ వంగా గీత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఠారెత్తుతున్న ఎండలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పరీక్షలు పెడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వాతావరణం వేడెక్కిపోతుండడంతో ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. అందుకే చాలా మంది నాయకులు.. మధ్యాహ్నం 3 తర్వాత నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. అయితే.. కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయిలో పోరు ఉండడంతో కొందరు నాయకులు మాత్రం ఎండైనా సరే.. ప్రచారం కొనసాగిస్తున్నారు.
దీంతో వారు ఎండబారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వైసీపీకి చెందిన సీనియర్ నాయకురాలు.. ఎంపీ వంగా గీత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పిఠాపురంలోనే జనసేన అధినేత పవన్ కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పోరు ఓ రేంజ్‌లో ఉంది. పవన్ ఇమేజ్‌ను తట్టుకుని విజయం దక్కించుకోవాలనేది గీత ఆకాంక్ష.
ఇది తప్పుకాదు. రాజకీయాల్లో ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. ఈ క్రమంలో ఆమె ఎండ కూడా లెక్క చేయకుండా.. ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ,ఎండలు మాత్రం ఠారెత్తుతున్నాయి. తాజాగా పిఠాపురం మండలం ఎఫ్‌కె పాలెంలో ప్రచారం నిర్వహిస్తుండగా గీత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటికే సమ యం మధ్యాహ్నం 1 గంట కావడంతో ఎండ తీవ్రతతోపాటు... వడగాడ్పులు కూడా వీస్తున్నాయి.
ఈ పరిణామంతో గీత తీవ్ర అస్వస్థతకు గురై ఆ తర్వాత కొద్ది సేపటికే స్పృహ కోల్పోయారు. ఆ వెంటనే ఆమె ను ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రచారాన్ని ఆమె కుమారుడు ముందుకు కొనసాగించారు. పార్టీ నాయకులు.. గీత వెంట ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. డీహైడ్రేషన్ కారణంగానే గీతకు తలతిరిగి.. స్పృహ కోల్పోయారని వైద్యులు తెలిపారు. కాగా.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచి కూడా గీత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.