రివేంజ్ పాలిటిక్స్ పై ఏపీ హోమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో ఏపీలో ముందు ముందు ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయనే చర్చ బలంగా నడిచింది.

Update: 2024-06-15 05:37 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రివేంజ్ పాలిటిక్స్ ఉంటాయా.. వైసీపీ నేతలకు వాయింపు తప్పదా.. ప్రధానంగా గత ప్రభుత్వ పాలనలో విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై వేటు తప్పదా మొదలైన చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. దానికి తోడు లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. పైగా ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ లపై బాబు అసహనం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో ఏపీలో ముందు ముందు ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయనే చర్చ బలంగా నడిచింది. పైగా టీడీపీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత కు హోంమంత్రి పదవి దక్కడంతో... ఆమెకు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇస్తారా.. ఇస్తే ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ బలంగా వినిపించింది.

పైగా... తాను హోంమంత్రిని అయితే అప్పుడు ఉంటుంది అంటూ గతంలో కొడాలి నాని, విజయసాయిరెడ్డి లను ఉద్దేశించి ఆమె బలంగా వ్యాఖ్యానించారు! ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ప్రతీకారం తీర్చుకునే విషయంపై స్పందించారు.

అవును... ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనిత తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... గతంలో పోలీసులతో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా.. గతంలో మహిళలపై జరిగుతున్న అఘాయిత్యాలపై డీజీపీని కలిసి వినతిపత్రం ఇద్దామని వెళ్తే... ఆఫీసు గేటు లోపలికి కూడా అనుమతించలేదని.. గుర్తు చేసుకున్నారు అనిత.

కట్ చేస్తే... ఇప్పుడు అధికారిక మర్యాదలతో తనను లోపలికి తీసుకెళ్తున్నారని.. ఈ విషయం కచ్చితంగా జరుగుతుందని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పానని అనిత వెల్లడించారు. ఇక గత ఐదేళ్లుగా వైసీపీతో అంటకాగిన పోలీసులు పద్దతి మార్చుకోవాలని.. మార్చుకోని పక్షంలో వారినే మార్చాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి.

ఇదే సమయంలో గతంలో సామాన్య ప్రజలను హింసించిన అధికారులు, నాయకులపై ప్రతీకారం తీర్చుకోము కానీ... తప్పనిసరిగా క్రమశిక్షణలో మాత్రం పెడతామని, పద్దతులు నేరిపిస్తామన్నట్లుగా అనిత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఏపీలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ఆమె తెలిపారు. ఈ విధంగా... అనిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News