నాలుగు దశాబ్దాల తరువాత ఉత్తరాంధ్రకు !
ఏపీ కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. శాఖలను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఏపీ కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. శాఖలను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అత్యంత కీలకంగా అంతా భావించే హోం మంత్రిత్వ శాఖ ఉత్తరాంధ్రాకు దక్కడం విశేషం. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న వంగలపూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను చంద్రబాబు కేటాయించారు.
పాయకరావుపేటకు చెందిన అనిత 2024 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేశారు. ఇపుడు ఏకంగా హోం మంత్రి అయ్యారు. టీడీపీ గత పదేళ్ళుగా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు.
ఇదిలా ఉండగా వంగలపూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించడంతో ఉత్తరాంధ్రాకు విశేష ప్రాధాన్యత మంత్రిమండలిలో లభించినట్లు అయింది. ఉత్తరాంధ్రకు హోం శాఖ దక్కడం ఇది రెండోసారి గతంలో అంటే 1988లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకటరావు హోం మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఇన్నాళ్ళకు పోలీస్ మంత్రి శాఖ ఉత్తరాంధ్రకు రావడం, విశాఖకే దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిత హోంమంత్రి గా తనదైన శైలిలో పనితీరుని చూపించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రెండు సార్లు ఈ పదవిని మహిళలకే కేటాయించారు. మొదటి దఫాలో మేకతోటి సుచరిత, రెండవ దఫాలో తానేటి వనిత హోం మంత్రులుగా పనిచేశారు నాడు ఎస్సీ సామాజిక వర్గానికే ఈ శాఖను కేటాయించారు. ఇపుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం హోం శాఖను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించడం విశేషమని అంటున్నారు.