పోలీసులకు లేడీ మినిస్టర్ స్వీట్ వార్నింగ్!.. టార్గెట్ ఎవరు?
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అనిత.. కొందరు పోలీసులు ఇంకా తమ తీరును మార్చుకోలేదన్నారు.
ఏపీ పోలీసులకు మహిళా మంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ''చేస్తే..సక్రమంగా పనిచేయండి. లేకపోతే వైసీపీ కండువాలు కప్పు కొని ఆపార్టీ సేవలో తరించండి'' అని తేల్చి చెప్పారు. ఆమె ఎవరో కాదు.. టీడీపీ నాయకురాలు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. చంద్రబాబు కేబినెట్‌లో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా నియమితురాలైన అనిత .. ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇదేసమయంలో సమీపంలోని పోలీసు స్టేషన్లను కూడా సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె విశాఖజిల్లాలో పర్యటించారు.
విశాఖలోని సింహాచలం అప్పన్న దేవాలయాన్ని దర్శించుకుని.. అనంతరం.. స్థానిక విశాఖ పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అనిత.. కొందరు పోలీసులు ఇంకా తమ తీరును మార్చుకోలేదన్నారు. వైసీపీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా వారు ఫీలవుతున్నారని తెలిపారు. ఇలాంటి వారు.. తమ యూనిఫాంను తీసేసి.. వైసీపీ కండువాలు కప్పుకొని రాజకీయాల్లో చేరాలని వార్నింగ్ ఇచ్చారు. తాను చార్జి తీసుకునేలోగానే నిర్ణయం తీసుకోవాలని.. తర్వాత మాత్రం ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతుంటే.. చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.
గంజాయి రవాణా, విక్రయాల విషయంలో కేసులు నమోదైనా.. వైసీపీ నాయకుల ప్రమేయం ఉందన్న కారణంగా పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. ''ఇంకా వైసీపీనే అధికారంలో ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ పద్ధతి మార్చుకోండి! లేకపోతే యూనిఫాం తీసేసి.. వైసీపీ జెండాలు పెట్టుకోండి''అని అనిత సీరియస్ అయ్యారు. ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాకు ఉత్తరాంధ్ర కీలకంగా ఉందని.. గత వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని.. కొంత మంది పోలీసులు కూడా సహకరించారని అన్నారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇకపై ఉండబోవన్నారు.
టార్గెట్ ఎవరు?
అందరినీ.. అన్నింటినీ ప్రక్షాళన చేస్తామని మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఒక టీచర్‌గా పిల్లలను సరిదిద్దినట్టుగానే వ్యవస్థను కూడా సరిదిద్దుతానన్నారు. అయితే.. అసలు మంత్రి కోపం ఎవరిపై? అనే చర్చ సాగుతోంది. విశాఖ నగర పోలీసు కమిషనర్ అయ్యన్నార్.. గతంలో టీడీపీ నేతలను కట్టడి చేశారు. నిరసనలు, ధర్నాలకు అడ్డుకట్ట వేశారు. పైగా ఆయన వైసీపీకి మద్దతారని అప్పట్లో టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు అప్పట్లో వైసీపీ సర్కారుబదిలీ చేసింది. అయినా.. ఆయన తీరు మారలేదు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేస్తూనే మంత్రి అనిత వ్యాఖ్యలు చేశారనే చర్చసాగుతోంది.