వంగవీటి రాధా ఇప్పుడు ఏం చేస్తారు?

తరాలు మారినా, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఆయన హాట్‌ టాపిక్కే.

Update: 2024-04-01 05:39 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన కుటుంబాల్లో ‘వంగవీటి’ కుటుంబం ఒకటి. దివంగత నేత వంగవీటి రంగా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తరాలు మారినా, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఆయన హాట్‌ టాపిక్కే.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన రాధా విజయవాడ తూర్పు నుంచి ఘనవిజయం సాధించారు. 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరిన రాధా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ఇక 2019లో తాను అడిగిన విజయవాడ సెంట్రల్‌ సీటును వైసీపీ అధినేత జగన్‌ ఇవ్వకపోవడంతో రాధా ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో రాధా ఎక్కడా పోటీ చేయలేదు. టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తుందని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు ఏ పదవీ దక్కలేదు.

మధ్యలో ‘కాపు ఫ్యాక్టర్‌’తో వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే రాధా ఆ పార్టీలో చేరబోనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం టీడీపీలోనే రాధా ఉన్నారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన ఎక్కడా సీటు అడగలేదో లేక పార్టీనే ఇవ్వలేదో కానీ రాధా పేరు కనీసం టీడీపీ టికెట్ల కేటాయింపులో పరిశీలనకు కూడా రాలేదు.

గతంలో రాధా ఆశించిన విజయవాడ సెంట్రల్‌ సీటును మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజికవర్గానికే చెందిన బోండా ఉమాకే చంద్రబాబు కేటాయించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధా తెనాలి వెళ్లి జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, గుంటూరులో ఎంపీ వల్లభనేని బాలశౌరితో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతో రాధా జనసేనలోకి వస్తారనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో రాధా పేరును బందరు పార్లమెంటు లేదా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నారని జనసేనలో టాక్‌ నడిచింది. అయితే ఎట్టకేలకు రెండు రోజుల క్రితం బందరుకు బాలశౌరినే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇక మిగిలింది అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గమే. ఇక్కడా పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక జనసేన ఇక్కడ ఐవీఆర్‌ఎస్‌ నిర్వహించింది. ఇందులో విక్కుర్తి శ్రీనివాస్‌ కు ఎక్కువ మంది మద్దతు తెలిపారు.

అయితే టీడీపీ అవనిగడ్డ ఇంచార్జిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరతారని.. ఆయనకే అవనిగడ్డ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ పిఠాపురం వెళ్లి పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరతారని చెబుతున్నారు. దీంతో రాధాకు సీటు లేనట్టేనని అంటున్నారు.

మరోవైపు టీడీపీ సైతం ఆయన పేరును పట్టించుకోకపోవడానికి ఆసక్తికర కారణం వినిపిస్తోంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్‌ లు రాధాకు ప్రాణ స్నేహితులు. పార్టీలకతీతంగా తాము మంచి స్నేహితులమని వీరు ముగ్గురు పలు పర్యాయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ను తిట్టిపోసే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధా అంటకాగడం వల్లే ఆయనకు సీటు ఇవ్వలేదని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2019లోనూ, ఇప్పుడూ పోటీ చేయకపోతే రాధా రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని అంటున్నారు.

Tags:    

Similar News