పల్నాడు ప్రజల అరవయ్యేళ్ళ నాటి కల... నిజం చేయనున్న జగన్!
అవును... ఇన్నేళ్ళుగా కాగితాలకే పరిమితమైన వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ఇప్పుడు జగన్ చొరవతో సాకారం అవుతోంది.
పనులు ఎగ్గొట్టడానికి ఏడు దారులు.. పనులు చేయడానికి ఒకటే దారి అంటారు. అంటే ఏదైనా పనిని మానేయాలి, వాయిదా వేయాలి అంటే ఆరేడు సాకులు దొరుకుతాయి. కానీ కార్యసాధకులు మాత్రం ఆ అడ్డంకులన్నీ దాటుకుని తమపని తాము పూర్తి చేసుకుని తామంటే ఏమిటో నిరూపించుకుంటారు. లోకానికి తమ సత్తాను చాటి చెబుతారు. ఇలా నిత్యం తన సత్తా చాటిచెబుతున్న ఏపీ సీఎం జగన్ వరికపూడిసెల ఎత్తి పోతల పథకం విషయంలో మరోసారి నిరూపించుకున్నారు.
అవును... ఇన్నేళ్ళుగా కాగితాలకే పరిమితమైన వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ఇప్పుడు జగన్ చొరవతో సాకారం అవుతోంది. ఆ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లుగా అనుమతులు ఇవ్వలేదు. అలాగని దాన్ని వేరేమార్గంలో చేపట్టే యోచన, చిత్తశుద్ధి పాలకులకు లేకపోవడంతో అది అక్కడే ఆగిపోయింది. అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన అది వాస్తవరూపం దాలుస్తోంది.
ఈ వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేస్తున్నారు. తొలి దశ పనులను వేగంగా పూర్తి చేసి.. అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా సుమారు 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు.
వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపూడిసెల వాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తి పోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్టులో చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది.
అయితే సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఈ పథకానికి మళ్ళీ కదలిక వచ్చింది. దీంతో గోదావరి - కృష్ణ - పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు.
ఈ క్రమంలో... ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కి.మీ.ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ అనుమతులు రానందునే ఇన్నాళ్ళుగా ఈ ప్రాజెక్టు ఆగింది. అయితే ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది.
అయితే... పలు మార్లు కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపిన తర్వాత వరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో... ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు.
ఆ పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్ధవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాచర్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. అక్కడ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ప్రాజెక్టు శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.