పవన్ గెలుపు పై పిఠాపురం వర్మ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా తన గెలుపు బాధ్యతను టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ చేతిలో పెడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఉగాది రోజున వర్మ స్పందించారు.
రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని, అసెంబ్లీలోకి ఎంటరవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలంగా ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్న ఆయన... సుమారు నాలుగు రోజుల పాటు అక్కడ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపు బాధ్యతను టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ చేతిలో పెడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఉగాది రోజున వర్మ స్పందించారు.
అవును... కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట నివాసముండేందుకు ఇల్లు చూసుకుంటా అని, అక్కడే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేబ్రోలులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఉగాది రోజున ఆయనే గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉగాది వేడుకలూ ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పవన్ తో పాటు పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ.. బీజేపీ ఇన్ ఛార్జి కృష్ణంరాజు, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో ఇప్పుడు పవన్ కు అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. అక్కడ కూటమి అభ్యర్థి గెలుపులో కీలక భూమిక పోషించే నేత అయిన ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎన్ని వేల కోట్లు ఖరు పెట్టినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. ఇదే సమయంలో... పవన్ కు భారీ మెజారిటీ తీసుకొచ్చే విధంగా టీడీపీ కేడర్ అంతా కలిసి కట్టుగా పనిచేస్తుందని చెప్పారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో ఉన్నా లేకున్నా.. తాను ప్రచారం చేస్తానని వెల్లడించారు.
ఆ సమయంలో టీడీపీ నేత రఘురామ కృష్ణంరాజు కూడా పవన్ తో భేటీ అయ్యారు. తాను ఎక్కడ పోటీ చేసినా పవన్ వచ్చి ప్రచారం చేయాలని కోరినట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా.. పవన్ విజయాన్ని అడ్డుకోలేరని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ 65 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించనున్నారని అభిప్రాయపడ్డారు. ఇలా టీడీపీకి చెందిన నేతలు.. పవన్ గెలుపు, మెజారిటీలపై మాట్లాడుతుంటే జనసైనికులకు ఉన్న చిన్నపాటి టెన్షన్ కూడా పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!