పవన్ ను గెలిపిస్తానన్న వర్మ.. ఇప్పుడు ఇలా అడ్డం తిరిగేశారేంటి?

పవన్ కల్యాణ్ ప్రకటన నేపథ్యంలో స్పందించిన వర్మ అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు.

Update: 2024-03-15 05:26 GMT

మాట తిప్పేయటం చూశాం కానీ.. మరీ వర్మ మాదిరా? అన్నదిప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించిన కాసేపటికే రచ్చ షురూ కావటం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎన్ వర్మ, ఆయన వర్గీయులు చేస్తున్న హడావుడి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి కారణం.. కొద్ది రోజుల క్రితం పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన వర్మ.. ఇంతలోనే ఇంతలా ప్లేట్ తిప్పేయటం ఏమిటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ప్రకటన నేపథ్యంలో స్పందించిన వర్మ అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. ‘ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగమయ్యా. పిఠాపురం డెవలప్ మెంట్ కోసం అలుపెరుగని పోరాటం చేశాను. ఇన్ని చేసిన నాకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం’ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ కొద్ది రోజుల క్రితం ఆయనే స్వయంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే.. తాను ఆయనకు దన్నుగా నిలుస్తానని.. నామినేషన్ వేసేసి వెళితే సరిపోతుందని.. ఆయన్ను గెలిపించటం తన బాధ్యతగా చెప్పుకోవటాన్ని పులువురు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఇదే వర్మ అప్పట్లో 70వేల మెజార్టీని పవన్ కు వచ్చేలా చేస్తానని గొప్పగా చెప్పటాన్ని ప్రస్తావిస్తున్నారు.

పవన్ పోటీ చేస్తే.. ఆయన్ను గెలిపించే బాధ్యత తనదని.. విజయాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తానని చెప్పిన వర్మ.. ఇప్పుడు నాలుక మడతేసి ఇలా మాట్లాడటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. వర్మ తాజా వ్యాఖ్యలపై మరో వాదన ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలని వర్మ కోరినప్పుడు స్పందించని పవన్.. ఇప్పుడు హటాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించటం సరికాదంటున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ స్థాయి అధినేత భావిస్తే.. ఆ విషయాన్ని వర్మకు చెప్పటం.. ఆయన్ను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని.. ఆ విషయంలో పవన్ చేసిన తప్పులకు వర్మ హర్ట్ అయ్యారంటున్నారు. అందుకే ఆయన టోన్ మారిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News