చేరేది ఆ పార్టీలోకే.....హింట్ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ ?

దీనిని బట్టి చూస్తే ఆమె చేరబోయే పార్టీ గురించి హింట్ ఇచ్చేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. టీడీపీ వైపుగా ఆమె అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

Update: 2024-11-02 19:30 GMT

వాసిరెడ్డి పద్మ ప్రజారాజ్యం నుంచి వైసీపీ వైపుగా వచ్చి అక్కడ తన రాజకీయాన్ని వేగం పెంచి ఏపీలో కీలక మహిళా నేతగా ఎదిగారు. వైసీపీలో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. కేబినెట్ ర్యాంక్ కలిగిన కీలకమైన పదవి అది.

అంతే కాదు అమె వైసీపీలో బలమైన మహిళా నేతగా ఉంటూ వచ్చారు. ఆమె పార్టీ తరఫున వాయిస్ ని గట్టిగా వినిపిస్తూ ప్రత్యర్ధులను హడలెత్తించేవారు. ఇదిలా ఉంటే ఆమె కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె వైసీపీని వీడిపోతున్న సమయంలో జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. అవి ఏపీలో సంచలనంగా మారాయి. పార్టీని ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ ఫెయిల్ అన్నట్లుగా ఆమె మాట్లాడారు. మరో వైపు చూస్తే వాసిరెడ్డి పద్మ మంచి సబ్జెక్ట్ తో మాట్లాడే మాటలు ప్రత్యర్ధులకు గుక్క తిప్పుకోలేనివే.

అందువల్ల ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని బాగా కాసుకుంటారు అన్న మాట ఉంది. ఆమె వైసీపీలో ఉన్నపుడు టీడీపీ జనసేన మీద పదునైన విమర్శలు చేశారు. దాంతో ఆమె ఈ రెండు పార్టీలలో దేనిలో చేరుతారు అన్న చర్చ నడచింది. అంతే కాదు ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తారు అని కూడా మరో వైపు ప్రచారం సాగింది.

అయితే లేటెస్ట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు అన్ని పార్టీలలోనూ ఆప్తులు ఉన్నారని చెప్పడం విశేషం. అంటే తనకు అన్ని పార్టీల నుంచి ఇన్విటేషన్లు ఉన్నాయని ఆమె చెప్పకనే చెప్పారు అన్న మాట. అదే సమయంలో ఆమె విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని తనకు ఎంతో ఆప్తులు అని అన్నారు.

దీనిని బట్టి చూస్తే ఆమె చేరబోయే పార్టీ గురించి హింట్ ఇచ్చేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. టీడీపీ వైపుగా ఆమె అడుగులు పడుతున్నాయని అంటున్నారు. టీడీపీలో అయితే ఎంతో మంది నేతలు ఉన్నారు. అయినా కొత్తగా వచ్చేవారికి అక్కడ లోటు ఉండదు, ఆ పార్టీ ఒక పుష్పక విమానంగా ఉంటుంది. దాంతో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరబోతున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఆమె వైసీపీలో ఉన్నపుడు చంద్రబాబుని ఎక్కడా స్పేర్ చేసేవారు కాదు, అంతే కాకుండా టీడీపీని గట్టిగా చీల్చి చెండాడిన నేతలలో ఆమె ముందు వరసలోనే ఉండేవారు. అయితే అదంతా ఆ పార్టీ ఫిలాసఫీలో భాగమే అని అంటారు.

ఆమె టాలెంట్ ని ఆమె సబ్జెక్ట్ ని ఆమె ప్రత్యర్ధులను టార్గెట్ చేసే తీరుని చూసి టీడీపీ ఆమెను చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో దశాబ్ద కాలం పైగా ఉండి వచ్చిన పద్మకు ఆ పార్టీలోని గుట్లూ మట్లూ అన్నీ తెలుసు కాబట్టి ఆమెను ఈ వైపు నుంచి ప్రయోగించి వైసీపీని టార్గెట్ చేయాలని టీడీపీ భావిస్తే మాత్రం పద్మ తొందరగా పసుపు పార్టీ చెల్లెమ్మ అవుతారు అని అంటున్నారు. ఆమె టీడీపీకి ఒక బలమైన వాయిస్ గా ఒక పదునైన ఆయుధంగా మారుతారు అని అంటున్నారు.

Tags:    

Similar News