విశాఖ 'దక్షిణ' .... కీలక సీటు, ఎవరికి దక్కేనో ?!
మరి పార్టీలు మారి పదవి కోసం పోరాడుతున్న వీరిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
విశాఖపట్నం దక్షిణ శాసనసభ నియోజకవర్గంలో పోరు అందరిలోనూ ఉత్కంఠకు గురిచేస్తున్నది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావుపై 3729 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. గత కార్పోరేషన్ ఎన్నికలలో ఆయన అధికార వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఇక వైసీపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణయాదవ్ జనసేనలో చేరి తన చిరకాల కోరిక ఎమ్మెల్యే ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓటరు దక్షిణ ఎవరికి దక్కనుంది అన్నది ఆసక్తిగా మారింది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్న విశాఖ పోర్టు, జగదాంబ జంక్షన్, ఫిషింగ్ హార్బర్, కేజీహెచ్ లు విశాఖ నగరానికే తలమాణికం. అన్ని మతాల ప్రజలు నివసించే ఈ నియోజకవర్గంలో రాజకీయం నేతలకు కత్తిమీద సాము వంటిదే అని చెప్పాలి. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుండి మొదట ద్రోణంరాజు శ్రీనివాసరావు విజయం సాధించగా, 2014,2019లో టీడీపీ తరపున వరసగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈసారి వైసీపీ తరపున బరిలో ఉన్నాడు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున వంశీకృష్ణయాదవ్ పోటీకి దిగాడు.
ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఆఫీసర్ గా పనిచేసిన వాసుపల్లి గణేష్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేసి వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేశాడు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయనకు 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చింది. 2019లో ఎన్నికయిన తర్వాత పార్టీలో కార్పోరేటర్లు, పార్టీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ తో పొసగక వైసీపీలోకి వెళ్లాడు. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ నేపథ్యంలో పార్టీ మారినా నియోజకవర్గంలో పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, ఆపదలో ఆర్థికంగా, ఇతరత్రా ఆదుకోవడం ఆయనకు ఉన్న అనుకూలతలు.
విశాఖ తూర్పుకు చెందిన వంశీకృష్ణయాదవ్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి, 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. విశాఖ తూర్పు నుండి ఈసారి వైసీపీ ఇంఛార్జ్ గా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించి ఎమ్మెల్యేగా ఆయనకే టికెట్ ఇవ్వడంతో వంశీకృష్ణయాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరి విశాఖ దక్షిణం నుండి ఆ పార్టీ తరపున పోటీ చేశాడు. ఇతనికన్నా ముందు జనసేనలో చేరిన కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులు మొదట ఈయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా పవన్ ఆదేశాలతో సైలెంట్ అయ్యారు. మరి పార్టీలు మారి పదవి కోసం పోరాడుతున్న వీరిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.