కమలాపురంలో మారిన ఈక్వేషన్.. టీడీపీకి ఎఫెక్ట్ ఎంత?
ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్న వీర శివారెడ్డి ఆ పార్టీకి షాకిచ్చారు. పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారు. త్వరలోనే వైసీపీలోకి వెళ్తానన్నారు. దీంతో కీలకమైన ఎన్నికల సమయంలో కమలాపురంలో రాజకీయ వాతావరణం మార్పు ఖాయమనే వాదన వినిపిస్తోంది. కమలాపురంలో సీఎం జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్‌రెడ్డి(విజయమ్మ తమ్ముడు) వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడ ఈసారి అయినా విజయం దక్కించుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి.
అయితే.. వీరశివారెడ్డిని కాదని.. పుత్తా చైతన్యరెడ్డికి టీడీపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. దీంతో శివారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. వాస్తవానికిటీడీపీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈయన పార్టీలో ఉన్నారు. కమలాపురం వంటి బలమైన కాంగ్రెస్ కంచుకోటలో ఆయన టీడీపీని డెవలప్ చేశారనేదివాస్తవం. 1994, 2004లో రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. అయితే.. తర్వాత నుంచి ఆయన ప్రాధాన్యం తగ్గించినా.. పార్టీలోనే ఉన్నారు. కానీ, ఈ దఫా మాత్రం పోటీ తథ్యమని ప్రజాగళం యాత్ర సమయంలో నారా లోకేష్ నుంచి హామీ తీసుకున్నారు. తీరా టికెట్‌ల పంపకాల సమయంలో మాత్రం ఈయనను పక్కన పెట్టారనేది ప్రధాన సమస్య.
ఇక, వీరశివారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి చేరితే.. ఇప్పటి వరకు అంతో ఇంతో పోటీ ఇస్తుందని భావిస్తున్న టీడీపీ పూర్తిగా చేతులు ఎత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి విజయం దక్కించుకోవడం.. పైగా బలమైన కంచుకోటా నియోజకవర్గాన్ని ఆయన డెవలప్ చేసుకున్న నేపథ్యంలో ఆయనకు తిరుగులేదనే వాదన ఉంది. ఇప్పుడు వీరశివారెడ్డి కూడా వైసీపీకి జై కొడితే.. ఈ బలం మరింత పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇది వైసీపీకి ఏకపక్షంగా విజయం అందించినా ఆశ్చర్యం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి బలమైన నాయకులను వదులు కోవడం ద్వారా.. టీడీపీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే అంచనాలు వస్తున్నాయి.