వైరల్ అవుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే కామెంట్స్
తాజాగా మీడియాతో మాట్లాడిన కాటపల్లి.. సభకు రాకుండా మొహాలు చాటేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రం గానే వ్యాఖ్యానించారు
తెలంగాణలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంక టరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా బాంబు పేల్చారనే అనాలి. ఇదే సమయంలో ఆయన కేసీఆర్ ను అడ్డు పెట్టుకుని.. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా షాకిచ్చేలా కామెంట్లు చేశారు. అంతే కాదు.. ఇప్పటి వరకు రాని ఐడియాను కూడా చెప్పేశారు. ఇక్కడితో కూడా ఆయన ఆగలేదు.. అసెంబ్లీ సమావేశాలకు రాని మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ఏం చేయాలా? అని తలపట్టుకుంటున్న సీఎం రేవంత్‌కు గొప్ప సలహానే ఇచ్చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన కాటపల్లి.. సభకు రాకుండా మొహాలు చాటేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రం గానే వ్యాఖ్యానించారు. సభకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేయాలని బాంబు పేల్చారు. సభకు వచ్చే ఎమ్మెల్యేలకే జీతం, భత్యాలు అమలు చేయాలని వారికే ఇవ్వాలని సూచనలు చేశారు. నెలకు 2 లక్షల 75 వేల రూపాయల తీసుకుంటూ.. ప్రొటోకాల్ అమలు చేయించుకుంటూ.. సెక్యూరిటీ తీసుకుంటూ.. సభకు డుమ్మా కొడతారా? అని నిప్పులు చెరిగారు.,
ఇలా.. సభకు రాకుండా డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలకు జీతంలో కోత పెట్టాలని వెంకట రమణా రెడ్డి సూచించారు. వారం రోజులు సభ జరిగితే ఎంతమంది ఎన్ని రోజులు వస్తే.. అన్ని రోజులకే వేతనం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా 10 రోజులు జరిగినా.. అంతే ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది ఖద్దరు దుస్తులు తొడుక్కుని.. హల్చల్ చేయడానికా? అని ప్రశ్నించారు. భద్రాద్రి రామయ్య లాగో.. యాదగిరి నరసింహస్వామిలాగో వచ్చి.. తమకు ఏదైనా చేసి పోతారని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
కానీ, ఎమ్మెల్యేలు సభకు రాకుండా డుమ్మాలు కొట్టి పోతున్నరని కాటపల్లి మండిపడ్డారు. అందుకే.. ఇలాం టి వారికి జీతాల్లో కోత పెట్టాలని అన్నారు. ప్రజా ధనంతో పదవులు పొంది.. ప్రజలు గెలిపిస్తే.. అసెంబ్లీలో కూర్చుకునే అవకాశం వచ్చిన వారు.. అసెంబ్లీకి రాకుండా.. వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే.. కాటపల్లి ఉద్దేశం మాజీ సీఎం కేసీఆర్ గురించేనన్నది అందరికీ తెలిసిందే. అయినా.. కాకపోయినా.. ఆయన నిర్ణయం మంచిదే.
కానీ, ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఇచ్చే జీతం ఒక లెక్కా? 2.75 లక్షలు వారికి ఓ డబ్బా? అనేది చర్చనీయాంశం. ఏడీఆర్ నివేదిక అంచనా ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీలో 92 శాతం మంది ఆస్తులు 100 కోట్ల కు పైగానే ఉన్నాయి. మరి ఇలాంటి వారికి అసెంబ్లీ ఇచ్చే రెండు లక్షలు ఎంత? అనేది కూడా.. కాటపల్లి లెక్కలు వేసుకోవాలి.