షర్మిల ఆధ్వర్యంలో ‘విభజన’ డ్రామాలు

అప్పట్లో అడ్డుగోలు విభజన చేసుండకపోతే ఇపుడీ ఆందోళనల డ్రామాల అవసరం ఉండేదే కాదు.

Update: 2024-02-02 05:45 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఢిల్లీలో విభజన హామీల సాధన కోసం డ్రామాలు మొదలవుతోంది. డ్రామాలని ఎందుకు అనాల్సొచ్చిందంటే అసలు అడ్డుగోలు విభజన చేసిందే కాంగ్రెస్ కాబట్టి. అప్పట్లో అడ్డుగోలు విభజన చేసుండకపోతే ఇపుడీ ఆందోళనల డ్రామాల అవసరం ఉండేదే కాదు. అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా అడ్డుగోలుగా రాష్ట్రాన్ని రెండుగా విభజించేసి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలను అమలుకు ఆందోళనలంటే వాటాని డ్రామాలని కాకుండా ఇంకేమనాలి ?

విభజన హామీల అమలుపై కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. అందుకు అనుమతులు కావాలని లేఖ రాస్తే ఇప్పటివరకు సమాధానం రాలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో చెప్పటమే విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని చేసేది ఆందోళన ఎలాగవుతుంది కార్యక్రమమే అవుతుంది. అనుమతి ఇవ్వకపోయినా చేసేదే ఆందోళనవుతుందన్న కనీస ఇంగితాన్ని కూడా గిడుగు కోల్పోయినట్లున్నారు.

విభజన చట్టం అమలన్నది దురదృష్టవశాత్తు రాజకీయాలకు బలైపోయింది. ఇందుకు కూడా యూపీయే ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. విభజన హామీల అమలుకు అప్పటి యూపీయే ప్రభుత్వం సరైన చట్టాన్ని చేయలేదు. ఇందుకు ఉదాహరణ ప్రత్యేకహోదా ప్రకటనే. ప్రత్యేకహోదా కచ్చితంగా ఇచ్చితీరాలని చట్టంలో చెప్పలకుండా కేవలం రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో ప్రకటన ఇప్పించారు. చట్టం చేయటానికి ప్రకటనకు యూపీఏ ప్రభుత్వానికి అంతమాత్రం తేడా తెలీకుండానే ఫోయిందా ? విభజన చట్టాన్ని అడ్డదిడ్డంగా చేయటం వల్లే తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఇష్టారాజ్యంగా వ్యవహరించగలిగారు.

రాష్ట్ర విభజన తర్వాత డెవలప్మెంట్ల పాపానికి యూపీఏ ఎంత కారణమో ఎన్డీయే అంతకుమించి కారణమని చెప్పకతప్పదు. అధికారంలో ఉన్నపుడు చేయాల్సిన డ్యామేజి అంతా చేసేసిన కాంగ్రెస్ ఇపుడు విభజన హామీలపై ఆందోళనలంటే జనాలు నమ్ముతారా ? కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి అదికూడా ఎన్నికలకు ముందు కాబట్టి షర్మిల హడావుడి చేస్తున్నారంతే. ఎన్నికలైపోతే షర్మిల కూడా మళ్ళీ ఈ విషయాలను ప్రస్తావించరంతే.


Tags:    

Similar News