వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవు.. జగన్ కి చెప్పే రాజీనామా

ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.

Update: 2025-01-25 08:41 GMT

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం సీనియర్ నేత విజయసాయిరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. తన రాజీనామాకు పూర్తిగా వ్యక్తిగత అంశాలే కారణమన్నారు. ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా లండన్ టూరులో ఉన్న అధినేత జగన్ తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వైఎస్ కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అందులో ఏ మాత్రం నిజం లేదని ఆ ఆరోపణలను కొట్టిపడేశారు.

ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ముందు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశానని, ఇక దానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సివుందన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని వివరించారు. ముందుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అన్నీ మాట్లాడానని తెలిపారు. భవిష్యత్ రాజకీయాల కోసం తాను మాట్లాడనని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకే రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసి పుచ్చారు.

2011లోనే తనపై 11 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో అప్రూవరుగా తనపై ఎంతో ఒత్తిడి చేసినా తలొగ్గలేదని, నమ్మిన వారిని మోసం చేయనని చెప్పుకొచ్చారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని వ్యాఖ్యానించారు. అప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయన్నారు. కాకినాడ సీ పోర్టు కేసుతో తనకు సంబంధం లేదని, ఆ కేసు నుంచి బయటపడేందుకే రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాక పార్టీకి రాజీనామా అన్న ప్రశ్న ఉత్పన్నమవదని తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వెళ్లిన తర్వాత రాజీనామా లేఖ సమర్పిస్తానని వివరించారు. తనలాంటి వారు వెయ్యి మంది రాజీనామా చేసినా వైసీపీకి నష్టమేమీ లేదన్నారు. అధినేత జగన్ కు మంచి ప్రజాదరణ ఉందని కితాబిచ్చారు. అదేవిధంగా వైఎస్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. నేను దేవుడిని నమ్మాను. నమ్మక ద్రోహం చేయను, కేసు మాఫీ కోసం రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం ఉందన్నారు. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు. నా రాజీనామా కూటమికే లాభం. 11 స్థానాలు గెలిచిన వైసీపీకి మళ్లీ రాజ్యసభ పదవి దక్కే అవకాశం లేదన్నారు.

Tags:    

Similar News