విజయసాయిరెడ్డి ఎంపీ సీటు ఆయనకే ఫిక్స్ ?
రాజ్యసభ ఎంపీలను అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపిస్తారు. ఆ సంఖ్యాబలం చూస్తే ప్రతీ సీటూ కూటమికే దక్కుతుంది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైసీపీ సీనియర్ నేత వి విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇంకా మూడున్నర ఏళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగవచ్చు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 దాకా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ నుంచి వైసీపీ తరఫున రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులలో ఆయన నాలుగో వారు.
రాజ్యసభ ఎంపీలను అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపిస్తారు. ఆ సంఖ్యాబలం చూస్తే ప్రతీ సీటూ కూటమికే దక్కుతుంది. మరి విజయసాయిరెడ్డి సీటు కూటమిలో ఏ పార్టీకి దక్కుతుంది అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది. కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. ఆ తరువాత జనసేన బీజేపీ ఉన్నాయి.
మరి ఈ మూడు పార్టీలలో ఎవరికి అంటే కచ్చితంగా బీజేపీకే ఈ సీటు వెళ్తుంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడంతో పాటు బీజేపీకి ఉన్న రాజకీయ పట్టు వల్ల ఆ పార్టీకి సీటు దక్కడం ఖాయమే అని అంటున్నారు.
ఇక చూస్తే బీజేపీలో ఎవరికి అన్నది మరో చర్చ. అయితే బీజేపీ నుంచి ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు ఏపీ కోటాలో వెళ్ళింది. ఆ సీటు తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్యకు దక్కింది. ఆయన కూడా వైసీపీ ఎంపీగానే ఉంటూ రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్ళీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు.
విజయసాయిరెడ్డి ఆ విధంగా చేయలేదు. ఏకంగా రాజకీయ సన్యాసం అనేశారు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఆయన వదిలేసిన ఆ సీటు ఆ మూడున్నరేళ్ల పదవీ కాలంతో కూడిన పెద్దల సభలో చాన్స్ మరో రెడ్డికే వెళ్తుంది అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
బీజేపీ ఏపీలో బలపడాలని చూస్తోంది. దాంతో విపక్ష వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమలో గట్టిగా పునాది వేసుకునేందుకు అక్కడ నుంచే మాజీ సీఎం బీజేపీ నేత అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాయలసీమలో బీజేపీని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారని అంటున్నారు.
మరో వైపు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో కమలం పార్టీ వికాసానికి రాచబాట వేసుకోవడానికి బీజేపీ చూస్తుంది అని అంటున్నారు. ఈ విధంగా ఖాళీ అయిన స్థానం తమదే అని బీజేపీ పెద్దలు స్పష్టం చేసారు అని అంటున్నారు దాంతో పోటీ పేచీకి ఎక్కడా కూటమి పార్టీలకు చాన్స్ లేనే లేదు అని తెలుస్తోంది. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ విధంగా విజయసాయిరెడ్డి పెద్దల సభలో దారులు తెరచారా అన్న చర్చ వస్తోంది.
బీజేపీకి ఈ సీటు దక్కితే మాత్రం ఏపీ నుంచి బేజీపీ కోటాలో రాజ్యసభ బలం రెండు కి చేరుకుంటుంది. మరో ఏడాది కనుక ఆగితే మరిన్ని రాజ్యసభ ఖాళీలు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ బలపడేందుకు ఈ పరిణామం దోహదపడుతోందని అంటున్నారు. ఏపీ నుంచి ఖాళీ అయిన ఈ రాజ్యసభ సీటు విషయంలో కూటమి పెద్దలు సమావేశమై తొందరలోనే నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.