వివేకాకు గుండెపోటని సాయిరెడ్డి చెప్పడానికి కారణం ఇదే!
ఈ క్రమంలో... ఇప్పటికే "సిద్ధం" అంటూ రాష్ట్రాన్ని హోరెత్తించేసిన ఆయన.. ఇప్పుడు "మేమంతా సిద్ధం" అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు
రానున్న ఎన్నికల్లోనూ సత్తా చాటాలని.. రెండోసారి అధికారంలోని రావాలని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... కూటమిగా ఏర్పడిన విపక్షాలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి ప్రచార పర్వాలు, మేనిఫెస్టో రూపకల్పన వరకూ వ్యుహాత్మకంగా వ్యవహారిస్తున్నారు.
ఈ క్రమంలో... ఇప్పటికే "సిద్ధం" అంటూ రాష్ట్రాన్ని హోరెత్తించేసిన ఆయన.. ఇప్పుడు "మేమంతా సిద్ధం" అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని ఎంపీలుగా పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగని విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు.
ఈ క్రమంలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిళ కూడా... వివేకా మర్డర్ కేసు పేరుచెప్పే జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హ్యూ కిల్డ్ బాబాయ్ అని హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ విమర్శలపై జగన్ తనదైన శైలిలో స్పందింస్తున్నారు. ఇందులో భాగంగా.. చిన్నాన్నను చంపినవారు బయటే తిరుగుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేస్తున్నారు.
ఈ సమయంలో.. వైఎస్ వివేకా మరణవార్త తెలియగానే "గుండెపోటుతోనే వివేకా మరణించారు" అన్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మేరకు నాడు తాను అలా చెప్పడానికి గల కారణాలను వివరించారు. దీంతో.. ఈ విషయం మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది!
ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెల్లడించిన విజయసాయిరెడ్డి... నాడు వివేకా మరణవార్త తెలియగానే తాను గుండెపోటు అనే విషయం చెప్పడానికి గల కారణాలను తెలిపారు. ఈ క్రమంలో... వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు తాను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని అన్నారు. తనకు తెల్లవారుజామున ఒక విలేకరి ఫోన్ చేశారని.. వివేకానందరెడ్డి మరణించినట్లు చెప్పారని అన్నారు.
దీంతో వెంటనే తాను పులివెందులకు ఫోన్ చేయగా.. అక్కడ తెలిసిన వారు గుండేపోటుతో మృతి చెందినట్లు చెప్పారని అన్నారు. అదే విషయాన్ని తాను మీడియాకు చెప్పినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో... ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు!