కేంద్రంలో కొత్త ప్రభుత్వం పై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారని తెలుస్తుంది.

Update: 2023-07-17 06:22 GMT

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారని తెలుస్తుంది. ఢిల్లీలో ఎన్డీయే మీటింగ్, బెంగళూరులో విపక్షాల మీటింగ్ నేపథ్యంలో సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా కీలకమైన విషయం తెరపైకి తెచ్చారని అంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైందని తెలుస్తుంది.

అవును... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. "30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీయే సమావేశం.. 24 పార్టీలతో బెంగళూరులో విపక్షాల సమావేశం జరుగుతున్నాయి. 2024లో వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారం చేపడుతుంది. అది రాష్ట్ర ప్రజల దీవెనలు, ఓట్ల ఆశీర్వాదం తోనే సాధ్యమవుతుంది. ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని జాతీయ మీడియా సర్వేల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని రిపోర్టులు వచ్చాయి" అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని తెలుస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు వైసీపీ మద్దతు అవసరం అయితే... జగన్ ఇస్తారా అనేది కూడా ఆసక్తిగా మారిందని అంటున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీకి పార్లమెంటులో అవసరమైన మేర జగన్ సహాయం చేస్తుంటారని అంటుంటారు.

కాగా... పాతమిత్రులు, కొత్త మిత్రులు, శ్రేయోభిలాషులు వంటి సుమారు 30 పార్టీలతో ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో కీలక సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలే కేంద్రంగా ఈ సమావేశం జరుగుతోందని అంటున్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడానికి అనుసరించాలసిన వ్యూహాలపై చర్చించనున్నారని సమాచారం.

అయితే ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఒక్క జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి కూడా అహ్వానం అందొచ్చని ఊహాగాణాలు నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ... మరో 23 పార్టీలతో కలిసి బెంగళూరులో ఈ నెల 17-18 తేదీల్లో రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు.

ఈ సమయంలో ఎవరు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని వ్యూహాలు రచించుకున్నా... ఫైనల్ గా కేంద్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా... వారికి కచ్చితంగా వైసీపీ సహాయం అవసరమవుతుందన్నట్లుగా సాయిరెడ్డి వ్యాఖ్యానించారని అంటున్నారు పరిశీలకులు. దీంతో... ఈసారి వైసీపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోనుందనేది ఆసక్తిగా మారింది.

కాగా... ఇటీవల నేషనల్ మీడియా "టైమ్స్ నౌ - నవ భారత్" చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లోనూ వైసీపీకి 24, టీడీపీకి 1 అని ఆ సర్వే తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... "పోల్ స్ట్రాటజీ" గ్రూప్ చేపట్టిన సర్వేలో కూడా... జనసేన+టీడీపీ కలిసినా కూడా జగన్ దే ఆదిపత్యం అని సూచించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News