వైసీపీలో కొత్త నిరసన: "జగనన్న ముద్దు - మా ఎమ్మెల్యే వద్దు"!
ఇదే సమయంలో గుంటూరు జిల్లా వినుకోండ నియోజకవర్గంలో గతకొంత కాలంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై ఆ పార్టీ కేడర్ గుస్సా అవుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సర్వే ఫలితాలను బట్టే కాకుండా.. స్థానికంగా ఆయనకున్న సమాచారం మేరకు వారికి హెచ్చరికలు జారీచేసేవారని చెబుతుంటారు. అయితే దానికి సంబంధించి ప్రజలు కూడా జగన్ అభిప్రాయాలతో, నిర్ణయాలతో ఏకీభవిస్తున్నారని తెలుస్తుంది.
అవును... ముఖ్యమంత్రిగా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ.. స్థానిక నాయకత్వంపై మాత్రం గుర్రుగా ఉంటున్న సంఘటనలు గత కొన్ని రోజులుగా కొన్ని నియోజకవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో... జగనన్న ముద్దు - ఈ వైసీపీ ఎమ్మెల్యే వద్దు అనే సంఘటనలు పలు నియోజకవర్గాల్లో రోడ్లపైకి వచ్చిన పరిస్థితి నెలకొంది!
అయితే ఈ విషయంలో జగన్ కి పక్కా సమాచారం ఉండే ఉంటుంది అనే సంగతి కాసేపు పక్కనపెడితే... వైసీపీలోని కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని నియోజకవర్గాలు తెరపైకి వస్తున్నాయి.
ఈ విషయంలో ఉమ్మడి జిల్లాల లెక్కన చూసుకుంటే... కనీసం జిల్లాలో ఒక్కరిపై అయినా ఇలాంటి ప్రచారం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా శృంగవరపు కోట (ఎస్.కోట) లో వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు స్థానిక ఎమ్మెల్యేపై ఫైరయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ అంటించడం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా స్థానిక వైసీపీ కార్యకర్తలు... "జగనన్న ముద్దు - కడుబండి వద్దు" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదని, రోడ్లను పట్టించుకోవడం లేదని వారంతా సొంతపార్టీ ఎమ్మెల్యేపైనే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇది కేవలం ఎస్. కోట నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన సమస్యగా లేదు. ఇదే సమయంలో గుంటూరు జిల్లా వినుకోండ నియోజకవర్గంలో గతకొంత కాలంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై ఆ పార్టీ కేడర్ గుస్సా అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. జగన్ నాయకత్వాన్ని కోరుకుంటూనే... ఎమ్మెల్యేగా వీళ్లు మాత్రం వద్దంటూ సొంతపార్టీ కార్యకర్తల నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి!
అయితే ఈ సమస్య కేవలం ఎమ్మెల్యేలకే పరిమితమైతే పొరపాటే అని అంటున్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వీరిలో ఒకరిద్దరు మహిళా మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
అయితే.. స్థానిక నాయకత్వంపై వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారే తప్ప... జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. వీరంతా "జగనన్న ముద్దు - ఫలానా ఎమ్మెల్యే వద్దు" అనే తమ నిరసనను వ్యక్తం చేస్తుండటం రాజకీయంగా కీలకమైన అంశంగా ఉంది!
మరి ఈ విషయాలపై జగన్ దృష్టి సారిస్తున్నారా.. ఇప్పటికే సారించారా.. ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టారా అనేది వేచి చూడాలి!