విశాఖ ఎంపీ సీటు...టీడీపీకి పాతికేళ్ళ కల...!

ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విశాఖ ఎంపీ సీటుకు సంబంధించి ఇప్పటిదాకా పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడే మూడు సార్లు టీడీపీ గెలిచింది

Update: 2024-02-01 08:30 GMT

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు కానీ ఈ రోజుకీ ఆ పార్టీ గెలవని సీట్లు చాలా ఉన్నాయి. కొన్ని సీట్లలో అయితే దశాబ్దాలుగా టీడీపీని ఓటమి పలకరిస్తూనే ఉంది. అటువంటి వాటిలో విశాఖ పార్లమెంట్ సీటు ఒకటి. ఈ సీటు ఆషామాషీదేమీ కాదు. విశాఖ ఎంపీ సీటు అంటే దేశంలోని 543 సీట్లలో ఠక్కున గుర్తుకు వచ్చే సీటు. ఈ సీటు నుంచి ఎవరు ఎంపీ అయినా విశాఖ పేరు మీదనే ఖ్యాతి పొందుతారు. గుర్తింపు కూడా అలాగే వస్తుంది.

ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విశాఖ ఎంపీ సీటుకు సంబంధించి ఇప్పటిదాకా పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడే మూడు సార్లు టీడీపీ గెలిచింది. దాన్ని బట్టి చూస్తే ఈ సీటులో సైకిల్ జోరు ఎంత వీక్ అన్నది అర్ధమవుతుంది. టీడీపీ అధినేత ఎన్టీయార్ ఉన్న టైం లో రెండు సార్లు గెలిచిన ఈ సీటు చంద్రబాబు టైం లో మాత్రం ఒక్కసారే గెలిచింది. 1984లో మొదటిసారి విశాఖ ఎంపీ సీటు నుంచి భాట్టం శ్రీరామమూర్తి గెలిచారు.

ఆయన తరువాత 1989 నుంచి ఆరు సార్లు ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేస్తే రెండు సార్లు మాత్రమే గెలిచారు. ఆయన 1989లో ఓడి, 1991లో గెలిచారు. ఆ తరువాత 1996లో ఆనందగజపతిరాజుకి టికెట్ ఇస్తే ఆయన ఓటమి పాలు అయ్యారు. 1998లో ఎంవీవీస్ మూర్తి మరోసారి ఓడారు.

ఇక 1999లో ఆయన రెండవసారి ఎంపీగా గెలిచారు 2004లో, 2009లో రెండు సార్లూ ఓడారు, 2014లో బీజేపీకి పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ గెలుచుకుంది. 2019లో పొత్తులు లేకుండా టీడీపీ పోటీ చేసింది. ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ కి టికెట్ ఇస్తే ఆయన నాలుగు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఆ విధంగా చూస్తే విశాఖ ఎంపీ సీటు ఎపుడూ టీడీపీని ఊరిస్తూనే ఉంది. 1999 తరువాత ఇప్పటికి టీడీపీ గెలిచింది లేదు. దాంతో పాతికేళ్ల తరువాత 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ చూస్తోంది. పొత్తులు బీజేపీతో ఉన్నా కూడా ఈసారి విశాఖ సీటుని వదులుకోకూడదని టీడీపీ గట్టిగా నిర్ణయించుకుందని అంటున్నారు. అందుకే టీడీపీ తాజాగా విడుదల చేసినట్లుగా చెబుతున్న అభ్యర్ధుల జబితాలో విశాఖ ఎంపీ సీటుని శ్రీ భరత్ కి కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది.

శ్రీ భరత్ కూడా గత అయిదేళ్ళుగా ఇదే సీటు మీద పట్టుదలగా ఉన్నారు. ఆయన జనంలో కూడా ఉంటూ వస్తున్నారు. ఏలాగైనా విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో కూర్చోవాలన్నది శ్రీభరత్ సంకల్పంగా ఉంది. గతసారి తక్కువ ఓట్ల తేడాతో ఆయన ఓడారు కాబట్టి ఈసారి గెలుస్తారు అని పార్టీ భావిస్తోంది. అయితే పొత్తులు బీజేపీతో లేకపోతే మాత్రం అర్బన్ ఓట్లలో భారీ చీలిక వస్తుందని అంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ విశాఖలోనే ఉన్నాయి.

బీజేపీ కనీసంగా ముప్పయి నుంచి నలభై వేల ఓట్లను చీల్చినా టీడీపీకి ఇబ్బందే అంటున్నారు. దానికి తోడు జేడీ లక్ష్మీనారాయణ కూడా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు మేధావులు చదువరులు, యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో జేడీ పోటీ వల్ల కనీసంగా మరో ముప్పయి నుంచి నలభై వేల ఓట్లు చీలినా టీడీపీకి ఇబ్బందే అంటున్నారు.

సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే వైసీపీ బీసీ అభ్యర్ధిగా బొత్స ఝాన్సీలక్ష్మిని పెట్టింది అని అంటున్నారు. కాపు, బీసీ లోకల్ కార్డుతో పాటు బొత్స రాజకీయ వ్యూహాలతో వైసీపీ రెండవసారి గెలవాలని చూస్తోంది. మరి టీడీపీకి ఈసారి అయినా విశాఖ ఎంపీ సీటు అందని పండు అవుతునా లేక దక్కుతుందా అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News