కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడుతున్న విశాఖ
అటు ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా నుంచి ఇటు ఉత్తర కోస్తాతో పాటు ఒడిషా నుంచి విశాఖకు వచ్చే ట్రాఫిక్ ఎక్కువ.
విశాఖ మెగా సిటీలలో ఒకటిగా ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న నగరం. ఏపీలో అయితే అతి ముఖ్య నగరం. విశాఖలో పాతిక లక్షలకు పైగా జనాభా ఉంటారు. అలాగే ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా విశాఖకు ఎక్కువే. అటు ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా నుంచి ఇటు ఉత్తర కోస్తాతో పాటు ఒడిషా నుంచి విశాఖకు వచ్చే ట్రాఫిక్ ఎక్కువ.
దాంతో విశాఖ అభివృద్ధితో పాటు కాలుష్యం కూడా హెచ్చుగానే ఉంది. అది నానాటికీ పెరుగుతోంది. ఢిల్లీ ఏ విధంగా కాలుష్యం కోరలలో చిక్కుకుని అల్లల్లాడుతోందో విశాఖ కూడా ఆ విధంగానే ఉంది అని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో సాధారణ వాయు కాలుష్యం రేటు 60 హెడ్జ్ ఉండాలి. కానీ అది ఇప్పటికే శృతి మించిపోయింది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం విశాఖలో ప్రమాదకర స్థాయిని దాటిందని అంటున్నారు. అది కాస్తా వంద హెడ్జ్ దాటిందని లెక్క వేస్తునారు. తాజాగా చూసుకుంటే ఈ దీపావళికి విశాఖ వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని గణాంకాలు తెలియచేస్తున్నాయి.
ఆసియా ఎయిర్ పొల్యూషన్ బోర్డు అందచేసిన వివరాలు ప్రకారం చూస్తే నవంబర్ 12న నమోదు అయిన వివరాలతో విశాఖలో వాయు కాలుష్యం వంద హెడ్జ్ ని దాటేసిందని అంటున్నారు. దీంతో ఆసియాలోనే వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖకు మూడవ స్థానం దక్కీందని అంటున్నారు.
ఇది నిజంగా విశాఖవాసులకు హెచ్చరికగానే చూస్తున్నారు. విశాఖ అభివృద్ధి చెందుతోంది అని సంతోషిస్తున్న వారు ఇపుడు వాయు కాలుష్యం డేటాను చూసి కలవరపడే పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి.
వీటి వల్ల కూడా వాయు కాలుష్యం హెచ్చు మోతాదులో నమోదు అవుతోంది అని అంటున్నారు. సాధారణంగా వాయు కాలుష్యం రేటు పెరగకుండా పరిశ్రమలు ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా జరగకపోవడం వల్లనే ఈ పరిస్థితి అని అంటున్నారు. అలాగే హెవీ ట్రాఫిక్ నేషనల్ హైవేను ఆనుకుని సిటీ ఉండడంతో కూడా గాలి కాలుష్యం అధికంగా ఉందనీ అంటున్నారు.
రోజులో ఇరవై గంటలకు పైగా విశాఖలో వాహనాల రద్దీ ఉంటోంది. ఇలాంటి అనేక ఇతర కారణాలు కూడా జతకలిసి వాయు కాలుష్యాన్ని ఏ ఏటికి ఆ ఏడు పెంచేస్తున్నాయి. వీటికి తగిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోకప్పోయినట్లు అయితే విశాఖ ఢిల్లీతో పోటీ పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ ఇపుడు ప్రపంచంలోనే వాయు కాలుష్యంలో మొదటి స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మరి విశాఖ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.