విశాఖ ఎంపీ సీటు వైసీపీకి టఫ్ అవుతుందా...!?

విశాఖ పార్లమెంట్ సీటులో 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి 2024 ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి

Update: 2024-02-20 03:27 GMT

విశాఖ పార్లమెంట్ సీటులో 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి 2024 ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. ఈసారి కూడా గెలిచి ద్వితీయ విఘ్నం దాటాలని వైసీపీ ఆశ పడుతోంది. అయితే విశాఖ ఎంపీ సీటులో టఫ్ ఫైట్ సాగనుంది అని అంటున్నారు.

విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో చూస్తే కనుక మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతీ పార్లమెంట్ సీటుని ఒక జిల్లాగా మార్పు చేశారు. దీంతో విశాఖ లోక్ సభ పరిధిలోకి ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాలు వచ్చేశాయి. గ్రామీణ ప్రాంతం అంటే ఎస్ కోటలో కొంత భాగం తో పాటు భీమిలీ పద్మనాభం ఆనందపురం మండల ప్రాంతాలు వస్తాయి. దీంతో నూటికి ఎనభై శాతం అర్బన్ ఏరియా ఉంది.

అర్బన్ ఏరియా అంటే కచ్చితంగా ఓటర్లలో ఒక రకమైన చైతన్యం ఉంటుంది. వారు ప్రతీ అయిదేళ్లకు పాలన ప్రభుత్వం మారాలని చూస్తారు. అదే విధంగా చూస్తే వైసీపీ మీద ఎక్కువ వ్యతిరేకత ఉన్నదే అర్బన్ ప్రాంతాలలో అని అంటున్నారు.

దాంతో వైసీపీ పధకాలు సంక్షేమం కూడా ఎక్కువగా అందుకున్నది పల్లె ప్రాంతాలు కావడంతో విశాఖ ఎంపీ సీటులో వైసీపీ అంచనా కడుతున్న సంక్షేమ ఓటు బ్యాంక్ ప్రభావం ఎంత ఉంటుంది అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక విశాఖ ఎంపీ సీటు పరిధిలో చదువుకున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అక్షరాస్యత రేటు కూడా ఏకంగా 58 శాతానికి పైగా ఉంది. ఇక . తాజాగా ఈ సంవత్సరం జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే విశాఖ ఎంపీ సీటులో మొత్తం ఒక వేయి 941 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19 లక్షల 42 వేల 593 మంది ఉన్నారు. అంటే ఓటర్ల పరంగా చాలా ఎక్కువ మందే ఉన్నారు.

ఇక వీరిలో పురుష ఓటర్లు 9 లక్షల 60వేల 101 మంది ఉంటే మహిళా ఓటర్లు.9 లక్షల 82 వేల 380 మంది ఉన్నారు. అలాగే 112 మంది థర్డ్ జెండర్ ఉన్నరు. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే భీమిలిలో అత్యధికంగా 3 లక్షల 51 వేల 462 మంది ఉంటే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 2లక్షల 6 వేల 943 మంది ఓటర్లు వున్నారని లెక్కలు చెబుతున్నాయి.

ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ జరిగింది. ఆనాడు వైసీపీకి 4 లక్షల 36 వేల 906 ఓట్లు పోలవ్వగా తెలుగుదేశం పార్టీకి 4 లక్షల 32 వేల 492 ఓట్లు వచ్చాయి. మూడో స్ధానంలో జనసేన పార్టీ అభ్యర్ధి వి.వి.లక్ష్మీనారాయణకు రెండు లక్షల 88 వేల 874 ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్ధానంలో 12 లక్షల 39 వేల 921 ఓట్లు పోలయ్యాయి.

గత సారితో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. 18-19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు 16,494 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు, దాంతో పాటు యువ ఓటర్లు ఎక్కువగా విశాఖ పరిధిలో ఉన్నారు. అలాగే నిరుద్యోగ యువత ఉంది. మేధావులు చదువరులు ఉన్నారు. ఉద్యోగ వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నారు. వీరంతా ఈసారి ఓటు ఎటు వేస్తారు అన్నది చర్చకు వస్తోంది.

ఇక 2019లో వైసీపీ హవా బలంగా వీచినా విశాఖ ఎంపీ పరిధిలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈసారి అయిదేళ్ల పాలన తరువాత ఎలా ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. వైసీపీ గతంలో వచ్చిన ఓటు బ్యాంక్ ని నిలబెట్టుకుంటూ మరింత ఎక్కువగా ఓట్లు సాధిస్తేనే ఈసారి గెలుపు సాధ్యం.

మరో వైపు చూస్తే బీజేపీ జనసేన టీడీపీ కూటమి కలిస్తే వైసీపీకి పెను సవాల్ అని అంటున్నారు. ఎందుకంటే మూడు పార్టీలకు విశాఖ అర్బన్ లో పట్టు ఉంది. సో విశాఖ ఎంపీ సీటు కనుక వైసీపీ పరం అయ్యేందుకు ఏ మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News