వివేక్ రామస్వామి దూకుడు... యాడ్స్ విషయంలో కీలక నిర్ణయం!
అవును... రిపబ్లికన్ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తనదైన నిర్ణయాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ... ఈ నెల రెండో వారంలో ఆరు రోజుల్లో ఏకంగా 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు! ఈ సమయంలో ప్రకటనల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రామస్వామి!
అవును... రిపబ్లికన్ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తనదైన నిర్ణయాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్ పై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ఘాటుగా స్పందించారు. ట్రంప్ ను పోటీ పడేందుకు అనుమతించకపోతే తాను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో ఇప్పుడు ప్రకటనల విషయంలోనూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించిరాని తెలుస్తుంది. ఈ క్రమంలో... సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతామని.. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు.
ఇదే సమయంలో క్యాంపెయినింగ్ కోసం ఇప్పటికే వెచ్చించిన వివరాలను వివేక్ రామస్వామి ఇప్పటికే వెల్లడించారు. ఇందులో భాగంగా.. తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. అయితే... ఇంత ఖర్చు చేసినప్పటికీ లోవాలో వివేక్ వైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
కాగా... అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరిలో లోవా రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. ఇలా లోవా ఓటింగ్ కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా వివేక్ రామస్వామి టీవీ ప్రకటనల విషయంలో ఇలా కీలక నిర్ణయం తీసుకున్నారు.